న్యూఢిల్లీ: ప్రపంచంలోని శరణార్థులకు ఆశ్రయం కల్పించడానికి భారత దేశం ధర్మసత్రం కాదని సుప్రీంకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. ఇప్పటికే 140 కోట్ల జనాభాతో ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంది. శ్రీలంకకు చెందిన తమిళ పౌరుడు దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం దోషి అని మద్రాస్ హైకోర్టు గతంలో తీర్పు చెప్పింది. ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.
ఈ శిక్షా కాలం పూర్తయిన తర్వాత ఆయనను దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది. ఈ తీర్పును పిటిషనర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, పిటిషనర్ శిక్షా కాలం అనంతరం దాదాపు మూడేళ్ల నుంచి నిర్బంధంలో ఉన్నారని చెప్పారు. ఆయనను దేశం నుంచి పంపించేందుకు ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. వీసాపై భారత్‌లోకి వచ్చిన ఆయన తిరిగి శ్రీలంకకు వెళితే, ఆయనకు తీవ్రమైన ముప్పు ఎదురవుతుందని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, ‘ఇక్కడ స్థిరపడటానికి మీకు ఉన్న హక్కు ఏమిటి?’ అని ప్రశ్నించింది.
న్యాయవాది బదులిస్తూ, పిటిషనర్ శరణార్థి అని, ఆయన భార్య, పిల్లలు ఇప్పటికే భారత్‌లో స్థిరపడ్డారని తెలిపారు. ధర్మాసనం బదులిస్తూ, పిటిషనర్‌ను చట్ట ప్రకారమే నిర్బంధించారని, ఈ విషయంలో రాజ్యాంగంలోని అధికరణ 21 ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేసింది. అధికరణ 19 ప్రకారం భారత దేశంలో స్థిరపడే హక్కు కేవలం భారత పౌరులకు మాత్రమే ఉందని వివరించింది. శ్రీలంకకు వెళ్లడం పట్ల ఆందోళన ఉంటే వేరొక దేశానికి వెళ్లాలని చెప్పి, పిటిషన్‌ను తిరస్కరించింది.
దేశవ్యాప్తంగా అక్రమ వలసదారుల గుర్తింపు, నిర్బంధం, బహిష్కరణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. బంగ్లాదేశ్, మయన్మార్ల నుంచి అక్రమంగా భారత్‌లోకి వచ్చినవారిని గుర్తించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అనుమానిత అక్రమ చొరబాటుదారుల గుర్తింపు పత్రాలను తనిఖీ చేసేందుకు లేదా దేశం నుంచి బహిష్కరించే ప్రక్రియను ప్రారంభించేందుకు రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు 30 రోజుల గడువు ఇచ్చింది. దీని కోసం రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు గల చట్టబద్ధ అధికారాలను వినియోగించాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది.