న్యూఢిల్లీ : స్థూల దేశీయోత్పత్తిలో(జీడీపీ) జపాన్ను అధిగమించి ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ అవతరించిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 4.18 ట్రిలియన్ డాలర్ల జీడీపీని సాధించిన భారత్ 2030 నాటికి జర్మనీని అధిగమించి తృతీయ ఆర్థిక శక్తిగా మారనున్నట్లు తెలిపింది.
దృఢమైన దేశీయ వినియోగం, బలమైన నిర్మాణాత్మకమైన సంస్కరణలతో భారత్ అత్యంత వేగంగా ఆర్థికాభివృద్ధిని పరుగులెత్తిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో భారత్ వాస్తవ జీడీపీ 8.2 శాతానికి విస్తరించిందని, మొదటి త్రైమాసికంలో ఇది 7.8 శాతం ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.4 శాతం ఉందని పేర్కొంది. ప్రపంచ వాణిజ్య అస్థిరతలు ఉన్నప్పటికీ ఆరు త్రైమాసికాల్లో అత్యధిక జీడీపీని సాధించగలిగినట్లు ప్రభుత్వం తెలిపింది.