Parliament session | న్యూఢిల్లీ, జూలై 24: పార్లమెంట్లో మణిపూర్ అంశంపై సోమవారం కూడా ప్రతిష్టంభన కొనసాగింది. ఉభయ సభలు ప్రతిపక్షాల ఆందోళనలతో అట్టుడికాయి. ప్రతిపక్ష నాయకుల నినాదాలతో సభలు హోరెత్తాయి. వారి ఆందోళనలతో ఉభయ సభల్లో గందరగోళం నెలకొన్నది. మణిపూర్ అంశంపై చర్చకు పట్టుబడుతున్న ప్రతిపక్షాలు ప్రధాని మోదీ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని మోదీ సభల వెలుపల మాట్లాడుతున్నారని, సభకు వచ్చేందుకు జంకుతున్నారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌సింగ్‌ను చైర్మన్ వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగాయి.
కేంద్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. రూల్ 267 ప్రకారం మణిపూర్ అంశంపై సమగ్ర చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ సభకు వచ్చేందుకు వెనకాడుతున్నారని పేర్కొన్నారు. ‘ప్రధాని మోదీ సభ బయట మాట్లాడుతూ పార్లమెంట్‌ను అవమానపరుస్తున్నారు. అత్యవసరమైన ఈ అంశంపై పార్లమెంట్ లోపల చర్చ జరగాలి’ అని ఆయన తెలిపారు. ప్రతిపక్షాల ఆందోళనలను కొనసాగించడంతో ఇరు సభలు మరుసటి రోజుకి వాయిదా పడ్డాయి.
Parlament
రాత్రంతా నిరసన దీక్ష
మరోవైపు మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలు వెనక్కి తగ్గడం లేదు. దీనిపై పార్లమెంట్లో ప్రధాని మోదీ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ, సంజయ్‌సింగ్ సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు పార్లమెంట్ ఆవరణలో నిరసన దీక్షకు కూర్చున్నాయి. గాంధీ విగ్రహం వద్ద ప్రతిపక్ష నాయకులు ఆందోళనలు చేశారు. సస్పెన్షన్‌కు గురైన ఎంపీ సంజయ్ సింగ్‌తో పాటు ఇతర నేతలు సోమవారం రాత్రంతా ఆందోళనలు కొనసాగించారు.