Nuclear Weapons | న్యూఢిల్లీ, జూన్ 17: అణ్వాయుధాల్ని పెంచుకోవటంలో భారత్, చైనా, పాకిస్థాన్ దేశాలు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. పాకిస్థాన్-170, భారత్-172 అణ్వాయుధాల్ని కలిగివున్నాయని, క్రితం ఏడాదితో పోల్చితే 2024 జనవరి నాటికి చైనా అణు వార్‌హెడ్స్ 410 నుంచి 500కు పెరిగాయని స్వీడన్‌కు చెందిన మేథో సంస్థ ‘సిప్రి’ (స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) తాజా నివేదిక పేర్కొన్నది. ‘అణ్వాయుధ సేకరణలో భారత్‌ను నిరోధించటమే లక్ష్యంగా పాకిస్థాన్ ప్రణాళికలు ఉన్నాయి.
సుదీర్ఘ లక్ష్యాల్ని తాకే అణువార్ హెడ్లపై భారత్ దృష్టిపెట్టింది. ముఖ్యంగా చైనా అంతటా లక్ష్యాల్ని చేరుకోగలగటం ప్రాధాన్యతగా ఉంది’ అని నివేదిక తెలిపింది. భారత్, పాక్, చైనా, అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ దేశాల అణు వార్హెడ్లకు సంబంధించి కీలక విషయాల్ని నివేదికలో పేర్కొన్నది. దీని ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2,100 అణ్వాయుధాలు ఉన్నాయి. దీంట్లో 90 శాతం అమెరికా, రష్యా కలిగి ఉన్నాయి.