PM Modi | లోక్‌సభ, పలు రాష్ర్టాల అసెంబ్లీలకు త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్రంలోని అధికార బీజేపీ ఎన్నికల స్టంట్ మొదలుపెట్టింది. ఇప్పటివరకూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచి సామాన్యుడి నడ్డివిరిచిన మోదీ సర్కారుకు ఎన్నికలు దగ్గరపడటంతో ప్రజలపై ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చింది.
వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.200 తగ్గిస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్ ధరను దాదాపు 3 రెట్లు పెంచిన మోదీ సర్కారు.. ఎన్నికల ముందర ప్రజాగ్రహాన్ని కొంతైనా తగ్గించుకునేందుకే గ్యాస్ ధరను తగ్గించిందని విశ్లేషకులు అంటున్నారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 29: లోక్‌సభతోపాటు ఐదు రాష్ర్టాల అసెంబ్లీలకు త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మోదీ సర్కారు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటివరకూ పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను అడ్డూఅదుపూ లేకుండా పెంచిన కేంద్రానికి ఎన్నికలు దగ్గరపడటంతో ప్రజలపై అకస్మాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చింది. గృహ వినియోగ సిలిండర్ ధరను రూ.200 తగ్గిస్తున్నట్టు కేంద్రం మంగళవారం ప్రకటించింది. తాజా తగ్గింపుతో హైదరాబాద్‌లో వంటగ్యాస్ సిలిండర్ రూ.950కి లభించనుండగా, ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఢిల్లీలో రూ.703కే లభించనున్నది.
కొత్తగా 75 లక్షల ఉజ్వల కనెక్షన్లు
దేశవ్యాప్తంగా మరో 75 లక్షల మందికి ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై) కింద వంటగ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నట్టు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు తెలిపారు. కొత్త కనెక్షన్లతో కలిపి పీఎంయూవై లబ్ధిదారుల సంఖ్య 10.35 కోట్లకు చేరుకొంటుందని వెల్లడించారు.
2014 నుంచి మూడు రెట్లు పెరిగిన ధర
2014లో వంటగ్యాస్ సిలిండర్ ధర దాదాపు రూ.400 ఉన్నది. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా పెరిగిపోయింది. మోదీ హయాంలో 13 సార్లు గ్యాస్ ధర పెరిగింది. 2014లో రూ.410గా ఉన్న 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర 2023, మార్చి నాటికి ఏకంగా రూ.1,155కి చేరింది. గత తొమ్మిదేండ్లలో దాదాపు రూ.900 మేర ధర పెరిగింది.
ఎన్నికలకు ముందు.. ఎన్నికల తర్వాత
ఇంధన ధరల విషయంలో బీజేపీ టక్కుటమార ట్రిక్కులకు పాల్పడింది. ఎన్నికలప్పుడు పెంపు ఊసుండదు. ఫలితాలు వచ్చీ రాగానే వాత షురూ అవుతుంది. ఈ అనుభవాలను ప్రజలు గతంలో చూశారు. గత ఏడాది ఫిబ్రవరి-మార్చి నెలల్లో యూపీతో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ర్టాల అసెంబ్లీల ఎన్నికలు జరిగాయి. దీనికి సరిగ్గా 5నెలల ముందు నుంచి పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ధరల పెంపును కేంద్రం ఆపేసింది. అలా ఎన్నికలు ముగిసాయో లేదా వాయింపు మొదలుపెట్టింది. 16 రోజుల వ్యవధిలో 14 సార్లు పెంపుతో ఏకంగా రూ.12 పెంచింది. దీన్ని బట్టే బీజేపీ ఎన్నికల వ్యూహాన్ని ఇట్టే అర్థం చేసుకోవచ్చు.