PM Modi : పశ్చిమాసియా (West Asia) లో ఇరాన్ (Iran) పై అమెరికా, ఇజ్రాయెల్ (USA, Israel) దేశాలు చేస్తున్న యుద్ధంతో ప్రపంచ దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. పలు దేశాలను ఇంధన కొరత ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఈ క్రమంలో యుద్ధం విసురుతున్న సవాళ్లను భారత్ (India) పూర్తి శక్తితో సమర్థంగా ఎదుర్కొంటోందని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. శనివారం నొయిడా (Noida) లో అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport) తొలి దశను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
పశ్చిమాసియాలోని పరిస్థితిని ప్రపంచమంతా గమనిస్తోందని ప్రధాని అన్నారు. అక్కడ నెల రోజులుగా భీకర యుద్ధం కొనసాగుతోందని చెప్పారు. ఈ సంఘర్షణ కారణంగా.. ఆహారం, ఇంధనం, గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడిందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. అనేక దేశాల్లో నిత్యావసర సరకుల కొరత ఏర్పడిందని తెలిపారు. ప్రతి దేశం ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందని చెప్పారు. ఈ సంక్షోభం నుంచి దేశాన్ని రక్షించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.
ప్రజలు, రైతులపై యుద్ధ భారం పడకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. సంక్షోభ సమయంలో కూడా ఎలాంటి అంతరాయం లేకుండా దేశంలో అభివృద్ధి కొనసాగుతోందని అన్నారు. ఇలాంటి సమయాల్లో ప్రజలు ఐక్యతతో ఉండాలని, ప్రశాంతతను పాటించాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఇంధన సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ.. ఈ విషయంలో ప్రజలను భయాందోళనకు గురిచేసే తప్పుడు ప్రచారాలు చేయవద్దని ప్రత్యర్థి రాజకీయ పార్టీలను కోరారు.
తమ ప్రభుత్వ విధానాలు దేశ ప్రయోజనాలకు, దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగానే ఉంటాయని ప్రధాని చెప్పారు. కాగా నోయిడాలోని జేవర్ ప్రాంతంలో పీపీపీ పద్ధతిలో రూ.11,200 కోట్లతో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. అధునాతన నావిగేషన్ సిస్టమ్స్ సాయంతో, 3,900 మీటర్ల పొడవైన ఈ విమానాశ్రయ రన్‌వేపై అతిపెద్ద విమానాలు కూడా రాకపోకలు సాగించే వీలుంటుంది. సరకు రవాణా కోసం కార్గో-లాజిస్టిక్ జోన్లను అనుసంధానిస్తూ మల్టీమోడల్ కార్గో హబ్‌ను కూడా నిర్మించారు.