Sarad Pawar- Gautam Adani | మరాఠా యోధుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ శనివారం అదానీ గ్రూప్ సంస్థ చైర్మన్ గౌతం అదానీ శనివారం కలిశారు. శరద్ పవార్, గౌతం అదానీ కలిసి గుజరాత్ రాష్ట్రం సనంద్ జిల్లాలోని ఓ గ్రామంలో ఒక ఫ్యాక్టరీని ప్రారంభించారు. అటుపై అహ్మదాబాద్‌లోని గౌతం అదానీ ఇంటిని, ఆయన ఆఫీసునూ శరద్ పవార్ సందర్శించినట్లు పవార్ తన ఎక్స్ (మాజీ ట్విట్టర్’ ఖాతాలో పోస్ట్ చేశారు. ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ ఫోటోనూ షేర్ చేశారు కానీ.. అక్కడ వారేం మాట్లాడుకున్నారన్న సంగతి మాత్రం బయట పెట్టలేదు.
తొలిసారి గత ఏప్రిల్‌లో శరద్ పవార్‌ను ముంబైలోని ఆయన నివాసంలో గౌతం అదానీ కలిశారు. అప్పట్లో రెండు గంటల పాటు వీరిద్దరు మాట్లాడుకున్నారని వార్తలొచ్చాయి. యూఎస్ షార్ట్ షెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికపై విపక్షాలు దుమ్మెత్తి పోతున్న టైంలోనే శరద్ పవార్‌తో గౌతం అదానీ భేటీ కావడం ప్రధాన్యం సంతరించుకున్నది.
హిండెన్‌బర్గ్ నివేదికపై సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ విచారణకే మొగ్గుతున్నట్లు శరద్ పవార్ అప్పట్లో చెప్పారు. ఆ తర్వాత గత జూన్ నెలలో మరోమారు పవార్‌తో గౌతం అదానీ భేటీ అయ్యారు. ఇదిలా ఉంటే వీరిద్దరి మధ్య 20 ఏండ్ల అనుబంధం ఉందని వార్తలొచ్చాయి.
2015లో పవార్ తాను ప్రచురించిన మరాఠీ ఆత్మకథలో ‘లోక్ మేజ్ సంగటి’లో గౌతం అదానీ గురించి ప్రస్తావించారు. సేల్స్ మ్యాన్‌గా కెరీర్ ప్రారంభించిన గౌతం అదానీ తన కార్పొరేట్ వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించారో శరద్ పవార్ సవివరంగా తెలిపారు.