heatwave : దేశం ఎండ వేడిమితో అట్టుడుకుతోంది. అనేక ప్రాంతాల్లో గతంలో ఎప్పుడూ లేని ఎండలు నమోదవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో గరిష్టంగా 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది అత్యంత ప్రమాదకర స్థాయి. దేశ రాజధాని ఢిల్లీతోపాటు మహారాష్ట్రలోని విదర్భలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు ఈ ఎండ వేడిమికి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు.
రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగి, వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. మహారాష్ట్రలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విదర్భ, అమరావతి పట్టణాల్లో 46.8 డిగ్రీలు, వార్దాలో 46.5 డిగ్రీలు, అకోలాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇతర పట్టణాల్లో కూడా ఇదే స్థాయిలో టెంపరేచర్ పెరుగుతోంది. మహారాష్ట్ర, ఢిల్లీలాంటి చోట్ల ఇప్పుడప్పుడే ఎండలు తగ్గే అవకాశం లేదని ఐఎండీ హెచ్చరించింది. అనేక ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రాంతంలో ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఢిల్లీలో ఉష్ణోగ్రతలతోపాటు వాయు కాలుష్యం కూడా కలవరపెడుతోంది. ఈ వారం అంతా నార్త్ ఇండియా, సెంట్రల్ ఇండియా, వెస్టర్న్ ఇండియాలలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. భారీ ఎండల నేపథ్యంలో ఐఎండీ.. ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని, ఎండ ప్రభావానికి గురి కాకుండా చూసుకోవాలని, ఇండ్లలోనే ఉంటూ తగినన్ని నీళ్లు తాగాలి, ముఖ్యంగా పగటి పూట బయటకు వెళ్లొద్దని సూచించింది.