న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్ జిల్లాలో ఇటీవల అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. అయితే అక్కడ మైనార్టీ ముస్లిం జనాభాకు రక్షణ కల్పించాలని కోరుతూ ఇటీవల బంగ్లాదేశ్(Bangladesh) వ్యాఖ్యలు చేసింది. ఆ ఆరోపణలను భారత్ తిప్పికొట్టింది. మీ దేశంలో ఉన్న మైనార్టీలపై మీరు ఫోకస్ పెట్టాలని భారత్ కౌంటర్ ఇచ్చింది. బెంగాల్ ఘటనపై బంగ్లా స్పందించడాన్ని విదేశాంగశాఖ ప్రతినిధి రణ్‌దీర్ జైస్వాల్ ఖడించారు. బంగ్లాదేశ్‌లో మైనార్టీల ఊచకోత జరుగుతోందని, దాన్ని బెంగాల్ ఘటనతో పోల్చడం సరికాదన్నారు. అనవసరమైన వ్యాఖ్యలు చేయడం కన్నా.. స్వంత మైనార్టీలపై బంగ్లా ఫోకస్ పెట్టడం బెటర్ అని రణ్‌దీర్ పేర్కొన్నారు.
వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల బెంగాల్లో నిరసనలు జరిగాయి. ముర్షీదాబాద్, మాల్దా, సౌత్ 24 పార్గనాస్, హూగ్లీలో అల్లర్లు జరిగాయి. దోపిడీలు, రాళ్లు రువ్వుకోవడంతో పాటు రోడ్లను బ్లాక్ చేశారు. ఆ హింసను ఖండిస్తూ బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ ప్రెస్ సెక్రటరీ షాఫికుల్ ఆలమ్ వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ హింసలో బంగ్లా పాత్ర ఉన్నట్లు భారత్ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ముస్లిం మైనార్టీలకు రక్షణ కల్పించాలని భారత ప్రభుత్వాన్ని, బెంగాల్ రాష్ట్రాన్ని కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఆలమ్ చేసిన వ్యాఖ్యలను భారత్ తిరస్కరించింది.