IND vs PAK : దాయాది పాకిస్థాన్ (Pakistan) కు భారత్ (India) మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్థాన్ పర్యవసానాలను ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. భారత్‌తోపాటు ప్రపంచ దేశాల్లోని అమాయకులను పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు (Terrorists) బలితీసుకున్నారని మండిపడింది. సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతు నిలిపివేసే వరకు సింధూ జలాల ఒప్పందం (Indus treaty) నిలిపివేత కొనసాగుతుందని స్పష్టంచేసింది.
ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాలపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) పరిష్కారానికి ద్వైపాక్షిక చర్చలే మార్గమని పునరుద్ఘాటించారు. జమ్ముకశ్మీర్ విషయంలో భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. ద్వైపాక్షిక చర్చలు తప్ప ఎలాంటి మధ్యవర్తిత్వాన్ని భారత్ అంగీకరించదని తెగేసి చెప్పారు. పీవోకేను పాకిస్థాన్ ఖాళీచేసే అంశం మాత్రమే మిగిలి ఉందని అన్నారు.
కాల్పుల విరమణపై తమ వైఖరి సుస్పష్టమని, ప్రపంచ దేశాల నుంచి తమతో సంప్రదింపులు జరిపిన వారందరితోనూ ఇదే విషయాన్ని చెప్పామని జైశ్వాల్ తెలిపారు. ఉగ్రవాదులను అణచివేయడమే భారత్ ప్రాథమిక లక్ష్యమన్నారు. పాక్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడిచేస్తే.. ప్రతిగా పాకిస్థాన్ దుస్సాహసానికి దిగిందని చెప్పారు. అందుకు ప్రతిచర్యగానే భారత్ పాకిస్థాన్‌పై దాడులు చేసిందన్నారు.
పాకిస్థాన్ కాల్పులు నిలిపివేస్తే భారత్ దాడులు ఆపేస్తుందని, వాళ్లు కవ్విస్తే తాము అంతకు రెండింతలు దెబ్బకొడుతామని, ఇదే విషయాన్ని తాము ప్రపంచ దేశాలకు స్పష్టం చేశామని రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు.