మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ : కేంద్ర మంత్రి హర్షవర్దన్

చెన్నై: త్వరలోనే దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. చెన్నైలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. రెండవ డ్రై రన్ సందర్భంగా నగరంలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిని విజట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అతి తక్కువ సమయంలోనే భారత్ టీకాలను అభివృద్ధి చేసినట్లు మంత్రి తెలిపారు. రానున్న కొన్ని రోజుల్లో, సమీప భవిష్యత్తులో.. దేశ ప్రజలకు ఆ టీకాలను ఇస్తామని ఆయన అన్నారు. తొలుతు హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్‌కు ఆ తర్వాత ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సిన్లు ఇవ్వనున్నట్లు మంత్రి హర్షవర్దన్ వెల్లడించారు. జాతీయ స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు ప్రతి విషయాన్ని ప్రజలకు చేరవేసేలా చర్యలు చేపట్టామన్నారు. లక్షల సంఖ్యలో హెల్త్‌కేర్ వర్కర్లకు శిక్షణ ఇచ్చామని, ఆ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని మంత్రి తెలిపారు. మీడియా సమావేశంలో ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సీ విజయ్‌భాస్కర్ కూడా పాల్గొన్నారు.
ఈనెల 2వ తేదీన దేశవ్యాప్తంగా సుమారు 125 జిల్లాల్లో వ్యాక్సినేషన్ డ్రైరన్ నిర్వహించామని మంత్రి హర్షవర్దన్ తెలిపారు. మూడు రాష్ట్రాలు మినహాయించి.. ఇవాళ కూడా దేశవ్యాప్తంగా డ్రై రన్ చేపడుతున్నట్లు చెప్పారు. ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న ఎన్జీవోలు వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించాలని ఆయన కోరారు. వ్యాక్సిన్ లబ్దిదారులను ఎంపికలో కీలక పాత్ర పోషించాలన్నారు. ఇక జనవరి 17వ తేదీన దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు పోలియా ఇమ్యునైజేషన్ డ్రైవ్ చేపట్టనున్నట్లు మంత్రి హర్షవర్దన్ వెల్లడించారు.