న్యూఢిల్లీ: బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాలను ఒకసారి పూర్తిగా భద్రతా తనిఖీలు పూర్తి చేసే ప్రక్రియలో ఉన్నట్లు ఎయిర్ ఇండియా (Air India) తెలిపింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజేసీఏ) ఆదేశాలు మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు శనివారం పేర్కొంది. ‘డీజీసీఏ నిర్దేశించిన వన్ టైమ్ భద్రతా తనిఖీలను పూర్తి చేసే ప్రక్రియలో ఎయిర్ ఇండియా నిమగ్నమైంది. ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానాల్లో తొమ్మిదిపై అలాంటి తనిఖీలు పూర్తయ్యాయి. రెగ్యులేటర్ పేర్కొన్న గడువులోగా మిగిలిన 24 విమానాల భద్రతా తనిఖీల ప్రక్రియను పూర్తి చేసే పనిలో ఉన్నాం’ అని ఎక్స్‌లో పేర్కొంది.
కాగా, బోయింగ్ 787 విమానాల అదనపు భద్రతా తనిఖీల వల్ల, ముఖ్యంగా సుదూర అంతర్జాతీయ మార్గాల్లోని విమాన ప్రయాణాలు ఆలస్యం కావచ్చని ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరే ముందు ప్రయాణీకులు తమ విమాన షెడ్యూల్‌ను చెక్ చేసుకోవాలని సూచించింది. ఈ భద్రతా తనిఖీల వల్ల కలిగే ఆలస్యం లేదా రద్దు వల్ల ప్రభావితమైన కస్టమర్లకు డబ్బు వాపసు లేదా ఉచిత రీషెడ్యూలింగ్‌ను ఎయిర్‌లైన్ అందిస్తుందని వెల్లడించింది.
మరోవైపు గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై డీజీసీఏ స్పందించింది. జెనెక్స్ ఇంజిన్లతో కూడిన ఎయిర్ ఇండియాలోని బోయింగ్ 787-8, 787-9 విమానాల భద్రతను పూర్తిగా తనిఖీ చేయాలని ఆదేశించింది. ఇంధన వ్యవస్థలు, క్యాబిన్ ఎయిర్ కంప్రెషర్లు, హైడ్రాలిక్ సిస్టమ్‌లు, ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్‌ల తనిఖీలు, ఇంజిన్ సంబంధిత పరీక్షలు వంటి ప్రమాద నివారణ నిర్వాహణ చర్యలు చేపట్టాలని పేర్కొంది. జూన్ 15 నుంచి ఈ తనిఖీలు చేపట్టి ఆ నివేదికలను డీజీసీఏకు సమర్పించాలని ఆదేశించింది. అహ్మదాబాద్‌లో కూలిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి దారి తీసిన కారణాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించింది.
Also Read:
ఎంటెక్ చదివేందుకు లండన్ వెళ్తున్న ఆటో డ్రైవర్ కూతురు.. విమాన ప్రమాదంలో మృతి
లండన్ టికెట్‌ను రెండుసార్లు రద్దు చేసుకున్న విజయ్ రూపానీ