Fuel Prices | న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ తదితర పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తగ్గించేందుకు బీజేపీ సారథ్యంలోని కేంద్రం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. గడచిన నాలుగేండ్లలో మొట్టమొదటిసారి బ్యారెల్ ముడి చమురు ధర 65 డాలర్లకు(రూ. 5,560) పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌కు మించి సరఫరా జరగడం వల్ల రోజురోజుకూ ముడి చమురు ధరలు తగ్గుతున్నాయి.
గతంలోనూ అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ భారత్‌లో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు ఏమాత్రం తగ్గలేదు. అధిక ఉత్పత్తి, రవాణా ఖర్చులు, భారీ స్థాయిలో పన్నుల కారణంగా దేశీయంగా చమురు ధరలు అధికమని నిపుణులు చెప్తున్నారు. అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా పతనమైనప్పటికీ భారత్‌లో మాత్రం వాటి ప్రభావం ఏమాత్రం ఉండబోదని, దేశంలో చమురు ధరలు తగ్గే అవకాశం లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచ ముడి చమురు ధరల పతనం భారత్‌కు శుభసూచకమని నిపుణులు చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వ పన్ను విధానం, చమురు కంపెనీల లాభాల శాతంపైనే పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, తగ్గింపు ఆధారపడి ఉంటాయి.