ముంబై : రోడ్ సేఫ్టీకి సంబంధించి వినూత్న రీతిలో ముంబై పోలీసులు చేపట్టిన క్యాంపెయిన్ వాహనదారులను ఆలోచనలో పడవేస్తోంది. రోడ్డుపై ప్రయాణించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన మార్గదర్శకాలను ప్రయాణీకులకు చేరువ చేసేందుకు పోలీసులు రావణుడి సాయం తీసుకున్నారు.
ఇన్‌స్టాగ్రాంలో ముంబై పోలీసులు షేర్ చేసిన ఈ షార్ట్ క్లిప్‌లో రావణ వేషధారి ముంబై ట్రాఫిక్‌లో బైక్ నడుపుతుండటం కనిపించింది. సిగ్నల్ వద్ద బైక్‌ను ఆపిన సమయంలో అక్కడే హెల్మెట్ లేకుండా ఓ ప్రయాణీకుడు రావణుడి కంటపడతాడు. ఏదైనా ప్రమాదం జరిగితే తనకు పది తలలున్నాయని, కానీ మనుషులకు ఒకటే తల ఉందని, దాన్ని కాపాడుకోవాలనే సంకేతాలు పంపుతాడు. వావణ వేషధారి సంకేతంతో వాహనదారు ఆలోచనలో పడతాడు.
మీ భద్రత కోసం ఆలోచించండి..మీకు పదితలలు లేవు..హ్యాపీ దసరా అంటూ ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్‌కు 25వేలకు పైగా వ్యూస్ రాగా పలువురు నెటిజన్లు పోలీసుల వినూత్న కాన్సెప్ట్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. మార్గదర్శకాలను సృజనాత్మకంగా వాహనదారులకు ముంబై పోలీసులు చేరవేశారని కామెంట్స్ సెక్షన్లో పలువురు రాసుకొచ్చారు.