న్యూఢిల్లీ, నవంబర్ 19 : మతపర అల్ప సంఖ్యాక వర్గాలకు వ్యతిరేకంగా భారత్‌లోని రాజకీయ వ్యవస్థ పనిచేస్తోందని, అధికార బీజేపీ-రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) బంధం వివక్షాపూరితమైన చట్టాలను సృష్టిస్తోందని యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్(యూఎస్సీఐఆర్ఎఫ్) భారత్‌పై విడుదల చేసిన తాజా నివేదికలో ఆరోపించింది. అమెరికన్ కాంగ్రెస్ మద్దతుతో పనిచేసే ఈ కమిషన్ ప్రత్యేకంగా భారత్‌పై ఈ నివేదికను విడుదల చేస్తూ జాతీయ, రాష్ట్ర స్థాయి చట్టాల అమలుతో దేశవ్యాప్తంగా మతపర స్వేచ్ఛపై తీవ్ర ఆంక్షలు ఏర్పడుతున్నాయని తెలిపింది. తాజా నివేదికపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వెలువడలేదు. అయితే యూఎస్సీఐఆర్ఎఫ్ ఈ ఏడాది మార్చిలో విడుదల చేసిన వార్షిక నివేదికపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ స్పందిస్తూ అందులోని అంశాలు అవాస్తవాలని కొట్టివేసింది. అమెరికాకు చెందిన ఈ సంస్థ పక్షపాతంగా, రాజకీయ దురుద్దేశంతో కూడిన అంచనాలు ఇవ్వడం మానుకోలేదని విమర్శించింది. మతపర లేదా మత విశ్వాసాల స్వేచ్ఛకు సంబంధించి కొన్ని రాజ్యాంగ రక్షణలు ఉన్నప్పటికీ మతపర మైనారిటీల పట్ల వివక్షాపూరిత వాతావరణాన్ని భారత్‌లోని రాజకీయ వ్యవస్థ సృష్టిస్తోందని తన తాజా నివేదికలో కమిషన్ పేర్కొంది. బీజీపీ, ఆర్ఎస్ఎస్ని హిందూ జాతీయవాద గ్రూపుగా అభివర్ణిస్తూ వీటి మధ్య అనుబంధం పౌరసత్వం, మత మార్పిడి, గోవధతోసహా అనేక వివక్షాపూరిత చట్టాల సృష్టికి, అమలుకు దారితీసినట్లు నివేదిక పేర్కొంది.
రాజ్యాంగంలోని లౌకికవాద సిద్ధాంతాలకు విరుద్ధంగా భారత్‌ను హిందూ దేశంగా నెలకొల్పే ఉద్దేశంతో 2014 నుంచి బీజేపీ వివిధ వర్గాల మధ్య చిచ్చుపెట్టే విధానాలు అమలుచేసిందని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. మతపర మైనారిటీలు తమ మత విశ్వాసాలను స్వేచ్ఛగా పాటించడానికి అవరోధం కల్పించడమే ఈ చట్టాల లక్ష్యమని యూఎస్సీఐఆర్ఎఫ్ ఆరోపించింది. హిందూ రాష్ట్ర లేదా హిందూ రాజ్యాన్ని నిర్మించడమే ఆర్ఎస్ఎస్ ప్రధాన లక్ష్యమని కమిషన్ తెలిపింది. ముస్లిములు, క్రైస్తవులు, యూదులు, బౌద్ధులు, పార్సీలు, ఇతర మతపర మైనారిటీలు లేని హిందూ దేశమే భారత్ అన్న భావనను ఆర్ఎస్ఎస్ ప్రోత్సహిస్తోందని కమిషన్ పేర్కొంది. ఆర్ఎస్ఎస్ నేరుగా తన రాజకీయ అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలపనప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీతోసహా బీజేపీ నాయకుల తరఫున ప్రచారం చేసేందుకు కార్యకర్తలను సమకూరుస్తుందని నివేదిక తెలిపింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా 2001 నుంచి 2014 వరకు పనిచేయడానికి ముందు నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ సభ్యుడని కమిషన్ పేర్కొంది. 2002లో వేలాదిమంది మరణాలకు దారితీసిన ముస్లిం వ్యతిరేక అల్లర్ల సందర్భంగా చర్యలు తీసుకోనందుకు ఆయన అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారని కూడా నివేదిక తెలిపింది. మతపరంగా వివక్షతో కూడిన పౌరసత్వ(సవరణ) చట్టాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుత నిరసనలకు నాయకత్వం వహిస్తున్న ఉమర్ ఖాలీద్ని 2020 నుంచి నిర్బంధంలో ఉంచడాన్ని కమిషన్ ఉదహరించింది. మతపరమైన స్వేచ్ఛకు సంబంధించి ఉల్లంఘనలకు పాల్పడుతున్న దేశంగా భారత్‌ను ప్రకటించాలని యూఎస్సీఐఆర్ఎఫ్ తన 2025 వార్షిక నివేదికలో అమెరికా విదేశాంగ శాఖకు ఆరవసారి సిఫార్సు చేసింది. అయితే దీనిపై అమెరికా విదేశాంగ శాఖ నుంచి ఎటువంటి చర్యలు ఇప్పటి వరకు లేవు.