న్యూఢిల్లీ : జాతుల మధ్య వైరంతో రెండేండ్లుగా రావణకాష్టంలా రగులుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ఎట్టకేలకు ప్రధాని మోదీ శనివారం పర్యటించనున్నారు. అల్లర్లు జరిగిన దాదాపు 28 నెలల తర్వాత ప్రధాని రాష్ట్రంలో పర్యటించనుండటం గమనార్హం. ఈ క్రమంలో రాష్ట్రంలో మళ్లీ హింస చెలరేగింది. చురాచాంద్‌పూర్‌లో ప్రధానికి స్వాగతం పలుకుతూ ఏర్పాటుచేసిన పోస్టర్లు, బ్యానర్లు, బ్యారికేడ్లను కొందరు గురువారం రాత్రి ధ్వంసం చేసి తగలబెట్టారు. దీంతో కల్లోల రాష్ట్రంలో మళ్లీ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చురాచాంద్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు ఐదు కి.మీ దూరంలోని పిసన్మున్ గ్రామంలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. నిరసనకారులను అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జి చేయడంతో పలువురు గాయపడ్డారు. కాగా, 2023 మే 3న ప్రారంభమైన జాతి కలహాలకు శాశ్వత పరిష్కారం కోసం చర్చలు ప్రారంభించకపోతే రాష్ట్రం మొత్తాన్ని మూసివేస్తామని రాష్ట్రంలోని తీవ్ర వాద గ్రూపుల సమన్వయ కమిటీ హెచ్చరించింది. కల్లోలం మొదలైన 28 నెలల తర్వాత ప్రధాని మోదీ జరుపుతున్న పర్యటనను పురస్కరించుకుని ఇంఫాల్‌లో ప్రధాని పాల్గొనే కాంగ్లా ఫోర్ట్, చురాచాంద్‌పూర్‌లోని పీస్ గ్రౌండ్ వద్ద పెద్దయెత్తున సీఆర్పీఎఫ్, పోలీసులను మోహరించారు. ఫోర్టు చుట్టూ ఉన్న జలాల్లో బోట్లతో గస్తీ నిర్వహిస్తున్నారు. కాగా, ప్రధాని మోదీ మిజోరాం, మణిపూర్, అస్సాం రాష్ర్టాలలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. గత కొద్ది నెలలుగా రిజర్వేషన్ల ఆందోళనలతో అస్సాం రాష్ట్రం కూడా అట్టుడుకుతున్నది.
కుకీ, మైతీ తెగల మధ్య 2023 మేలో మొదలైన ఘర్షణలతో మణిపూర్ అట్టుడుకుతున్నది. ఘర్షణల్లో 200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన యావత్ దేశాన్ని కలచివేసింది. వేలాది మంది నిరాశ్రయులై సహాయ శిబిరాలలో ఆశ్రయం పొందుతున్నారు. ఆ రాష్ట్రంలో అల్లర్లు చెలరేగిన తర్వాత ప్రధాని ఒక్కసారి కూడా ఆ రాష్ర్టాన్ని పర్యటించి శాంతి భద్రతలను సమీక్షించకపోవడాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుపడుతూ వస్తున్నాయి. ఇన్నాళ్లకు మోదీకి మణిపూర్ గుర్తుకు వచ్చిందా? అని పలు వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. హింస చోటుచేసుకున్న రెండేళ్ల తర్వాత మోదీ ఈ రాష్ట్రంలో తొలిసారిగా పర్యటించనున్నారు. కాగా, శనివారం మోదీ రాష్ట్రంలో రూ.8,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని మణిపూర్ చీఫ్ సెక్రటరీ పునీత్ కుమార్ గోయల్ తెలిపారు. మిజోరాం నుంచి ఆయన మొదట చురాచాంద్‌పూర్ వస్తారని, అక్కడి నుంచి ఇంఫాల్‌కు చేరుకుంటారని చెప్పారు. ప్రధాని చురాచాంద్‌పూర్, ఇంఫాల్‌లలో ప్రజలతో భేటీ అవుతారు. వారి సమస్యలను ఆలకిస్తారు.ప్రధాని పర్యటనతో రాష్ట్రంలో శాంతి, సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేశారు. కాగా, రెండేండ్లుగా హింసతో రగులుతున్న మణిపూర్‌లో ప్రధాని పర్యటించడం పెద్ద విషయం కాదని, ఇప్పుడు ఓటు చోరీయే ప్రధాన అంశమని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రెండేళ్లుగా హింసతో రగులుతూ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రాష్ట్రపతి పాలనలో ఉన్న రాష్ర్టాన్ని సందర్శించడానికి మోదీకి ఇంతకాలం పట్టిందా? అని విపక్షాలు నిలదీశాయి.
అస్సాంలోనూ పర్యటించనున్న ప్రధానికి అక్కడ కూడా నిరసన సెగ తగిలే అవకాశం ఉంది. 2014లో ప్రధానమంత్రి చేసిన వాగ్దానాలను గుర్తు చేయాలనుకునే స్థానిక వర్గాలు ఇప్పటికే రాష్ట్రంలో భారీ నిరసనలు నిర్వహించారు. ఆయన చేసిన వాగ్దానాలు ఇంకా నెరవేరలేదని వారు అంటున్నారు. బీజేపీ కనుక అధికారంలోకి వస్తే పలు సామాజిక వర్గాలకు ఎస్టీ హోదా కల్పిస్తామని అస్సాంలో 2014లో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ హామీనిచ్చారు. అయితే మోదీ ఇచ్చిన హామీ నెరవేరలేదని అహోమ్, మోరన్, మతక్, టీ ట్రైబ్, చుటియా, కోచ్-రాజ్బొంవషిస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. తర్వాతి ఎన్నికల్లో సైతం అదే వాగ్దానం చేసినా దానిని నిలబెట్టుకోలేదని వీరు విమర్శిస్తున్నారు. 2026లో అస్సాం అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఈ వర్గాలు తమ డిమాండ్లను పునరుద్ధరిస్తూ జూలై నుంచి ఆందోళన నిర్వహిస్తున్నాయి. ఇక వీరిలో కోచ్-రాజ్బోంగోషిస్ వర్గీయులైతే తమకు ప్రత్యేక కాంతాపూర్ రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 3న ఈ వర్గం విద్యార్థులు జరిపిన కాగడాల ప్రదర్శన లాఠీచార్జికి దారితీసి హింసాత్మకంగా మారింది. దీంతో 4న వారు దుబ్రీ జిల్లాలో 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 3న మోరన్ సామాజిక వర్గం20 వేల మందితో ప్రదర్శన జరపడం మీడియా దృష్టిని ఆకర్షించింది. ప్రజల కష్టాలను ఆలకించకుండా అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం వారిపై పోలీసులతో దారుణంగా దాడి చేయిస్తున్నదని అస్సాం కాంగ్రెస్ చీఫ్ గొగోయ్ ఆరోపించారు.