Southwest Monsoon | మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాల తిరోగమన ప్రక్రియ ప్రారంభంకానుందని వాతావరణ శాఖ తెలిపింది. అంతకు ముందు దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్తో పాటు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే మరికొద్ది రోజుల్లో గాలిదిశ మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.
తిరోగమనానికి ముందు రుతుపవనాలు మళ్లీ వాయువ్య ప్రాంతాలను తేమగా మార్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న మూడు రోజుల్లో తెలంగాణ, యూపీ, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
మరో వైపు దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా.. ఉష్ణోగ్రతలు తగ్గుముఖంపడుతున్నాయి. రుతుపవనాలు సాధారణంగా సెప్టెంబర్ 20 నాటికి దేశం నుంచి తిరోగమిస్తాయి. అక్టోబర్ వరకు చెదురుమదురు వర్షాలు అవకాశాలుంటాయి. రుతుపవనాలు ఈ నెల 27-28 మధ్య దేశ రాజధాని ఢిల్లీ నుంచి రుతుపవనాలు తిరోగమిస్తాయని స్కైమెట్ వాతావరణ సంస్థ అంచనా వేసింది.
ఈ క్రమంలో గాలి దిశ మారనుండడంతో.. మళ్లీ ఢిల్లీలో కాలుష్యం పెరిగే అవకాశం ఉన్నది. నైరుతి రుతుపవనాల సమయంలో దేశంలో సగటు వర్షాపాతం కంటే 7శాతం ఎక్కువగా నమోదైంది. అయితే, యూపీ, బీహార్, జార్ఖండ్, ఢిల్లీ, పంజాబ్, త్రిపుర, మిజోరం, మణిపూర్లలో తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ నెల 19 వరకు దేశంలో 872 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.