Delhi | ఉత్తర భారతదేశంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో(Heavy rains) జనజీవనం స్తంభించిపోతున్నది. గురువారం తెల్లవారుజామున ఢిల్లీలోని(Delhi) కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షాలకు రోడ్లు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయ్యమ్యాయి. ఢిల్లీలోని పలు ప్రాంతాలకు ఇప్పటికే ఐఎండీ అధికారులు ఆరెంజ్ అలర్ట్(Orange alert) జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, మునీర్కా, ఇతర ప్రాంతాలతో సహా నగరంలోని కొన్ని ప్రాంతాలలో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశంలో కురుస్తున్న వర్షాలపై సమీక్షించారు. మంగళవారం కేరళలోని వయనాడ్లో శిథిలాలు కూలిపోయి పలువురు చనిపోవడం, జమ్మూలోని దోడాలో ఆకస్మిక వరదలు, మహారాష్ట్ర, గుజరాత్లలో ఆస్తి నష్టం, ప్రాణ నస్టం జరిగిన నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి భారీ వర్షాల వల్ల తలెత్తిన పరిస్థితులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.