IMD | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. మధ్యాహ్నానికి వాయుగుండంగా మారి.. ఉత్తర తమిళనాడు (Tamil Nadu), పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాల వైపు కదులుతూ రాగల 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి (heavy rain). చెన్నై సహా పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. రోడ్లు, వీధులు నదులను తలపిస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో చెన్నై సహా పలు తీర ప్రాంత జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. విళుపురం, మైలాడుతురై, కడలూరు, చెంగల్పట్టు జిల్లాలు, పుదుచ్చేరిలో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, రాణిపేట, తిరువణ్ణామలై, కళ్లకురిచ్చి, అరియలూరు, పెరంబలూరు, తంజావూరు, తిరువారూరు, నాగపట్టిణం జిల్లాలు, కారైక్కల్‌లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీవర్షం, సేలం, తిరుచ్చి, వేలూర్, తిరుప్పత్తూర్, ధర్మపురి, పుదుక్కోట్టై జిల్లల్లో ఒకటి రెండు చోట్ల భారీవర్షానికి అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అల్పపీడనం నేపథ్యంలో ప్రకాశం, వైఎస్ఆర్ కడప, పొట్టిశ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పల్నాడు జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35-55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ వద్ద ఉండరాదని సూచించింది. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. పొంగి పోర్లే వాగులు,రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరించింది.
Also Read..
Air Pollution | ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగ.. క్షీణించిన గాలి నాణ్యత
PM Modi | ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలి.. ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ