Air Pollution | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో వాయు కాలుష్యం రోజురోజుకీ క్షీణిస్తోంది. దీపావళి (Diwali) అనంతరం గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం (Central Pollution Control Board).. దీపావళి అనంతరం రెండు రోజుల తర్వాత బుధవారం ఉదయం ఢిల్లీలో వాయు కాలుష్యం అధ్వాన స్థితికి చేరింది. ఏకంగా ఏక్యూఐ లెవెల్స్ 345గా నమోదయ్యాయి. ఉదయం 6:15 గంటల సమయంలో అశోక్ విహార్, బవానా, దిల్షాద్ గార్డెన్ ప్రాంతాల్లో ఏక్యూఐ 380గా నమోదైంది. డీటీయూ, ఎయిర్పోర్ట్, లోధి రోడ్డు సహా ఇతర ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ 300 కంటే ఎక్కువగానే నమోదైంది. మరోవైపు రాజధాని ప్రాంతాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో విజిబిలిటీ కూడా పడిపోయింది. ముందు వెళ్తున్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి. ఫలితంగా రాజధాని వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
సుప్రీంకోర్టు విధించిన మూడు గంటల పరిమితిని ఉల్లంఘించి చాలా మంది ప్రజలు టపాసులు కాల్చడంతో మంగళవారం ఢిల్లీలోని రెడ్ జోన్లో వాయు నాణ్యత చాలా తక్కువ (వెరీ పూర్) స్థాయిలో నమోదైన విషయం తెలిసిందే. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి బులెటిన్ ప్రకారం మంగళవారం ఉదయం 8 గంటలకు వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 352 పాయింట్లుగా నమోదైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిమితి కంటే ఇది 15 రెట్లు ఎక్కువ. ఈ నెల 20న ఏక్యూఐ 345 పాయింట్లుగా నమోదైంది.
ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రిసెర్చ్ నివేదిక ప్రకారం.. గాలి నాణ్యత 447కు పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని, AQI 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని అర్థం. ఇక AQI 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, AQI 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, AQI 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్థం చేసుకోవచ్చు.
Also Read..
PM Modi | ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలి.. ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ
Gold Rates | గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
Satya Nadella | ఏఐ బూమ్.. భారీగా పెరిగిన సత్యనాదెళ్ల జీతం.. ఎంతంటే..?