గౌహతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి (IIT Guwahati) పరిశోధకులు మరో ఘనత సాధించారు. భూగర్భ జలాల్లోని ఫ్లోరైడ్, ఐరన్ తొలగించే నీటి శుద్ధి వ్యవస్థను అభివృద్ధి చేశారు. (fluoride removal system) సమర్థవంతమైన ఈ వ్యవస్థ ద్వారా రోజుకు 20,000 లీటర్ల వరకు కలుషిత నీటిని శుద్ధి చేయవచ్చు. సురక్షితమైన తాగునీటి సౌకర్యం లేని ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో నీటి శుద్ధి వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చు. ఐఐటీ గౌహతిలోని కెమికల్ ఇంజినీరింగ్ విభాగం హెడ్, పరిశోధకుడు ముఖేష్ భారతి, పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ అసోసియేట్స్ డాక్టర్ అన్వేషన్, డాక్టర్ పియల్ మండల్, ప్రొఫెసర్ మిహిర్ కుమార్ పుర్కైట్ కలిసి దీనిపై పరిశోధన చేశారు. భూగర్భ జలాల్లోని ఫ్లోరైడ్, ఐరన్ తొలగించే నీటి శుద్ధి వ్యవస్థను అభివృద్ధి చేశారు. ప్రతిష్టాత్మక ఏసీఎస్ ఈఎస్ అండ్ టీ వాటర్ జర్నల్‌లో ఈ పరిశోధన గురించి ప్రచురించారు.
కాగా, ఈ నీటి శుద్ధి వ్యవస్థను వాస్తవ పరిస్థితుల్లో 12 వారాల పాటు పరీక్షించినట్లు ఐఐటి గౌహతి కెమికల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ మిహిర్ కే పుర్కైట్ తెలిపారు. కలుషిత జలాల నుంచి 94 శాతం ఇనుము, 89 శాతం ఫ్లోరైడ్‌ను తొలగించిన ఫలితాలు సాధించినట్లు చెప్పారు. ఈ వ్యవస్థ ద్వారా 1000 లీటర్ల నీటి శుద్ధికి కేవలం రూ.20 ఖర్చు మాత్రమే అవుతుందన్నారు. ప్రతి ఆరు నెలలకు ఎలక్ట్రోడ్ మార్చాల్సి ఉంటుందని, తద్వారా ఈ వ్యవస్థ 15 సంవత్సరాలు పని చేస్తుందని వివరించారు.
మరోవైపు అస్సాంలోని పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగం మద్దతుతో చాంగ్సరిలోని కాకతి ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ నీటి శుద్ధి వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ప్రొఫెసర్ మిహిర్ కే పుర్కైట్ తెలిపారు. సోలార్ లేదా విండ్ పవర్ ద్వారా యూనిట్‌ను ఆపరేట్ చేసే విధానం, ఉత్పత్తి అయ్యే హైడ్రోజన్ గ్యాస్ వినియోగంపై మరింతగా పరిశోధనలు చేస్తున్నట్లు చెప్పారు. రియల్ టైమ్ సెన్సార్లు, ఆటోమేటెడ్ నియంత్రణలు వంటి స్మార్ట్ టెక్నాలజీల ద్వారా తక్కువ సిబ్బందితో తాగునీటి వసతి లేని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో వీటి ఏర్పాటు, మిగతా వాటర్ ప్లాంట్స్‌తో అనుసంధానంపై కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Bomb Threat | ప్లాన్ ఏ విఫలమైతే ప్లాన్ బీ సిద్ధం.. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు బెదిరింపులు
Calf Born With 2 Heads | రెండు తలలు, మూడు కళ్ళతో జన్మించిన దూడ.. చూసేందుకు ఎగబడిన జనం
Watch: గ్యాస్ స్టేషన్ సిబ్బందిపై గన్ గురిపెట్టిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?