ముంబై: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని పదవిని చేపట్టడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని శివసేన (ఉద్ధవ్) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) అన్నారు. కూటమికి రాహుల్ నాయకత్వం వహించడానికి సమ్మతిస్తే తామెందుకు అడ్డుచెబుతామని చెప్పారు. జాతీయ నాయకుడిగా ఇప్పటికే చాలాసార్లు నిరూపించుకున్నారని తెలిపారు. అత్యంత ప్రజాధరణ కలిగిన నాయకుల్లో రాహుల్ ఒకరని పొగడ్తల్లో ముంచెత్తారు. ఆయనను తామంతా కోరుకుంటున్నామన్నారు. ఈ విషయంలో కూటమిలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు.
ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రధాని పదవిపై ఇండియా కూటమిలో ఎలాంటి విభేదాలు లేవన్నారు. బీజేపీ నియంతృత్వ పాలన నుంచి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడానికి తాము నిరంతరం పోరాడామని తెలిపారు. అందుకే ప్రజలు మాకు ఓటు వేశారని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ, అమిత్ షాలు ఇప్పటికైనా తమ ఓటమిని అంగీకరించాలని చెప్పారు.