Karnataka : కర్ణాటకలో డీకే శివకుమార్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు ఒక కొత్త చిక్కు వచ్చి పడింది. కర్ణాటక మంత్రివర్గంలో ఐదుగురు ముస్లింలకు క్యాబినెట్ స్థాయి మంత్రి పదవులు ఇవ్వాలని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు కర్ణాటకలోని ముస్లిం మతపెద్దలు, ఉలేమాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముస్లింల మద్దతుతోనే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు.
అందువల్ల తమ వర్గానికి ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం దక్కాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. ముస్లిం మతపెద్దలు, కొందరు కాంగ్రెస్ ముస్లిం నేతలు బుధవారం హుబ్బలిలోని ఒక దర్గాలో సమావేశమై చర్చించారు. అనంతరం తమ డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. సీనియర్ కాంగ్రెస్ లీడర్లు బీజడ్ జమీర్ అహ్మద్ ఖాన్, ఎన్ఏ హరిస్, తన్వీర్ సైత్, సలీమ్ అహ్మద్ వంటి నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. ముస్లిం వర్గానికి చెందిన యూటీ ఖాదర్ ఇప్పటికే కర్ణాటక అసెంబ్లీలో స్పీకర్గా కొనసాగుతున్నారు. అందువల్ల మరో నాలుగు మంత్రి పదవులు ముస్లింలకు కేటాయించాలని డిమాండ్ చేశారు.
మరో ముస్లిం మత పెద్ద మాట్లాడుతూ తమకు ప్రభుత్వంలో, క్యాబినెట్లో ప్రాధాన్యం కల్పించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కర్ణాటకలో ముస్లింలు ఐక్యంగా ఉండి కాంగ్రెస్కు మద్దతుగా నిలిచామని, పార్టీని అధికారంలోకి తెచ్చామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తమ పాత్ర ఎంతో కీలకమన్నారు. అందువల్లే తాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ విషయంపై భవిష్యత్లో ఇంకా ఒత్తిడి తెస్తామన్నారు. తాము కాంగ్రెస్కు మద్దతు ఇస్తామని, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని మత పెద్దలు వివరించారు.
ఐదు మంత్రి పదవులు దక్కకపోతే తమ సత్తా ఏంటో ప్రభుత్వానికి తెలిసేలా చేస్తామని హెచ్చరించారు. కర్ణాటకలో శివకుమార్ ఆధ్వర్యంలోని కొత్త ప్రభుత్వం బుధవారం కొలువుదీరిన సంగతి తెలిసిందే. అనంతరం 13 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. మరింతమందికి మంత్రివర్గంలో ఛాన్స్ ఉంది. అందుకే ముస్లిం సంఘాలు ఇప్పుడు ఈ డిమాండ్ అందుకున్నాయి.