న్యూఢిల్లీ: బీజేపీతో లోపాయికారి ఒప్పందంతో ఎంతోమంది ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి పారిపోయారన్న విమర్శలున్నాయి. బ్యాంకులకు వేలకోట్లు ఎగవేసి బ్రిటన్‌కు పారిపోయిన ఆర్థిక నేరగాడు విజయ్‌మాల్యా తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. భారత్ నుంచి 2016లో తాను పారిపోవడానికి ముందు అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి, బీజేపీ నేత అరుణ్ జైట్లీకి సమాచారం ఇచ్చానని విజయ్ మాల్యా తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన దేశం నుంచి పారిపోవడం, అందుకు దారితీసిన పరిస్థితులు మరోసారి చర్చను లేవనెత్తాయి. ‘విమానాశ్రయానికి బయల్దేరే ముందు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి తెలియచేసి ఆ తర్వాత ఢిల్లీ నుంచి లండన్‌కు విమానం ఎక్కాను.
ఈ వార్త బయటకు పొక్కడంతో మీడియా, రాజకీయ వర్గాలలో పెద్ద దుమారమే రేగింది. చట్టపరమైన ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో దేశం విడిచి నేను ఎలా వెళ్లగలిగానని ప్రశ్నలు మొదలయ్యాయి’ అని పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ విజయ్ మాల్యా తెలిపారు. ‘మేం ఇద్దరం కలసి ఉండగా చూశానని ఓ కాంగ్రెస్ ఎంపీ ప్రకటించారు. దీంతో జైట్లీ మాట మార్చారు. తాను మాల్యాను కలిసిన మాట వాస్తవమేనని, అయితే వాకింగ్ చేస్తుండగా కలిశానని ఆయన చెప్పారు’ అంటూ మాల్యా గుర్తు చేసుకున్నారు. ‘ఓ సమావేశం కోసం జెనీవాకు వెళ్లేందుకు తాను లండన్ బయల్దేరుతున్నట్లు ఆర్థిక మంత్రికి తెలియచేశానని మాత్రమే నేను చెప్పాను. నేను తిరిగి వస్తాను. కూర్చుని సమస్యను పరిష్కరించుకుందామని బ్యాంకులకు దయచేసి నచ్చచెప్పండి అని కోరాను. ఈ నాలుగు ముక్కలు చెప్పడానికి ఎంత సమయం పడుతుంది’ అని మాల్యా ప్రశ్నించారు.
విజయ్ మాల్యా తాజా ప్రకటనపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోదీ, కేంద్రంపై ఎక్స్ వేదికగా వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ‘పాక్‌కు ముందుగానే సమాచారం అందచేసి విదేశాంగ మంత్రి సైనిక దాడి చేస్తారు. ఆర్థిక మంత్రికి ముందుగానే చెప్పి ఆర్థిక నేరస్థులు దేశం విడిచి పరారవుతారు. నరేంద్ర మోదీకి చెందిన యావత్ వ్యవస్థ లొంగిపోయినట్లుగా ఉంది’ అంటూ ఖేరా ఎద్దేవా చేశారు.