కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సిద్దూ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఆదివారం పంజాబ్‌లో పర్యటించారు. లుథియానా వేదికగా పంజాబ్ సీఎం అభ్యర్థి చెన్నీయే అని ప్రకటించారు. ఈ సందర్భంగా జరిగిన వర్చువల్ ర్యాలీలో రాహుల్ గాంధీ సిద్దూను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ’40 సంవత్సరాల క్రితమే నేను సిద్దూను కలిశా. కానీ.. నన్ను కలిసినట్లు ఆయనకే తెలియదు. నేను అప్పుడు డూన్ స్కూళ్లో చదువుతున్నా. అక్కడికి క్రికెట్ ఆడటానికి సిద్దూ వచ్చారు’ అని రాహుల్ ఈ వేదిక ద్వారా గుర్తు చేసుకున్నారు. మరోవైపు ఇదే వేదికగా రాహుల్ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఎవరైనా కేవలం 12 రోజుల్లోనే రాజకీయ నేతగా అయిపోరని, టీవీల్లో నిత్యం కనిపించినంత మాత్రాన రాజకీయ నేతలు కాలేరని వ్యాఖ్యానించారు.
పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ని సింహంతో పోల్చారు. సీఎం అభ్యర్థి విషయంలో తాను రాహుల్ గాంధీ మాటకే ఓకే చెబుతానని పునరుద్ఘాటించారు. సీఎం అభ్యర్థిగా ఎవర్ని ప్రకటించినా తనకు సమ్మతమేనని, రాహుల్ మాట జవదాటనని, సీఎం అభ్యర్థితో కలిసే పనిచేస్తానని రాహుల్ గాంధీ ముందే ప్రకటించారు. పంజాబ్‌ను ప్రేమించే వ్యక్తినని, ఈ సారి అందర్నీ కలుపుకొనిపోయే వ్యక్తి సీఎం కావాలని సిద్దూ ఆకాంక్షించారు.