అయోధ్య: అయోధ్యలో కొలువుదీరిన రామ్‌లల్లా(Ayodhya Ramlalla)ను దర్శించుకునేందుకు భక్తులు ఎగబడుతున్నారు. రోజూ లక్షల సంఖ్యలో జనం రామయ్యను దర్శించుకుంటున్నారు. ఇంకా నిర్మాణ దశలోనే ఉన్న ఆ ఆలయానికి భక్తుల తాకిడి విపరీతంగా ఉన్నది. కుంభమేళాలో పుణ్య స్నానాలు చేసేందుకు వెళ్తున్న భక్తులు.. ఆ భక్తిభావంతోనే రామయ్య సన్నిధికి కూడా తరలివస్తున్నారు. దీంతో అయోధ్య వీధులన్నీ కిక్కిరిసిపోయాయి.
ప్రతి క్షణం వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. శ్రీ రామ జన్మభూమి స్థలంలో నిర్మించిన నూతన ఆలయానికి అపరిమిత సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. కుంభమేళా నుంచి డైరెక్టుగా అయోధ్య చేరుకుంటున్నారు. అనేక లైన్లలో భక్తుల్ని రామయ్య దర్శనం కోసం పంపించే ఏర్పాట్లు చేశారు.
రామజన్మభూమిలో భక్త కోటి ప్రవాహాన్ని .. యాత్రికులు తమ మొబైళ్లలో బంధిస్తున్నారు. రామ్‌లల్లా దర్శనం కోసం వెళ్లిన ఓ భక్తుడు తీసిన వీడియోను పోస్టు చేస్తున్నాం. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద.. వేల సంఖ్యలో భక్తులు రామనామాన్ని స్మరిస్తూ ముందుకు వెళ్తున్నట్లు ఆ వీడియోలో ఉంది.