Pahalgam Attack | ప్రశాంతంగా ఉండే కశ్మీర్ లోయ తూటాల శబ్దంతో మార్మోగిపోయింది. మంగళవారం మధ్యాహ్నం సమయంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 26 మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్నారు. పలువురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, కొందరు పర్యాటకులు ఈ ఉగ్రదాడి నుంచి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. వారిలో కేరళ రాష్ట్రానికి చెందిన ఓ బృందం కూడా ఉంది.
కేరళ రాష్ట్రం నుంచి చిన్నారి సహా దాదాపు 23 మంది కశ్మీర్ పర్యటనకు వచ్చారు. వాళ్లంతా మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో ప్రకృతి అందాలను ఆశ్వాదించేందుకు వెళ్లారు. అయితే, టూరిస్ట్ స్పాట్‌కు వెళ్లాలంటే గుర్రంపైన వెళ్లాల్సి ఉంటుంది. దీంతో వారు గుర్రపు స్వారీ (Horse Ride) కోసం ధర ఎక్కువగా ఉండటంతో వేరే ప్రదేశానికి ట్యాక్సీ మాట్లాడుకుని వెళ్లిపోయారు. దీంతో ఈ దాడి నుంచి త్రుటిలో ప్రాణాలతో బయటపడినట్లైంది. ఈ భయంకర అనుభవాన్ని సదరు టూరిస్ట్‌లు మీడియాతో పంచుకున్నారు.
‘వేరే ప్రదేశానికి వెళ్తున్న సమయంలో మాకు కొన్ని శబ్దాలు వినిపించాయి. దుకాణాలు మూసివేస్తున్నారు. ప్రజలు పారిపోతున్నారు. అక్కడ ఏం జరుగుతోందో మాకు అర్థంకాలేదు. మేము అందమైన ప్రదేశానికి తీసుకెళ్లమని మా గైడ్‌ను అడిగాము. అప్పుడు ఆయన అన్నారు.. బతికి ఉండాలనుకుంటున్నారా..? లేదా..? అని. ట్యాక్సీ అతను సరాసరి మా హోటల్ వద్దకు తీసుకెళ్లాడు. టీవీలో వార్తలు చూశాక తెలిసింది.. అక్కడ జరిగింది ఉగ్రదాడి అని. గుర్రపు స్వారీకి వెళ్లి ఉండి ఉంటే.. ఇప్పుడు చనిపోయిన వారిలో మేము కూడా ఉండేవాళ్లం’ ’ అని తమకు ఎదురైన ఈ భయంకరమైన అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు. అంతేకాదు పర్యాటక ప్రదేశాల్లో ఎక్కడా భద్రత లేదని వారు ఆరోపించారు. ఉగ్రదాడి జరిగిన ప్రదేశంలో భద్రతా సిబ్బంది ఒక్కరు కూడా లేరని అన్నారు. అందుకే వారు ఆ ప్రదేశంపై దాడి చేసినట్లు చెప్పుకొచ్చారు.
Also Read..
Pahalgam Attack | ఉగ్రవాదుల ఆచూకీ చెప్పిన వారికి రూ.20 లక్షల రివార్డు
PM Modi | కలలో కూడా ఊహించని రీతిలో శిక్ష ఉంటుంది.. ఉగ్రవాదులకు ప్రధాని మోదీ సీరియస్ వార్నింగ్