న్యూఢిల్లీ, డిసెంబర్ 14: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సుఖు వివాదంలో చిక్కుకున్నారు. సిమ్లాలో ఆయన పాల్గొన్న ఒక విందులో జంతు రక్షణా చట్టం పరిధిలో ఉన్న అడవి కోడిని వండి వడ్డించినట్లు ఆరోపణలు వచ్చాయి. వంటల జాబితాలో అడవి కోడి మాంసం ఉన్నట్లు జంతు సంక్షేమ సంస్థ ఒకటి షేర్ చేసిన వీడియోలో వెల్లడి కావడంతో ఈ వివాదం వెలుగు చూసింది. ఈ ఘటనపై జంతు ప్రేమికులతోపాటు బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
సిమ్లాకు చెందిన ఒక మారుమూల ప్రదేశంలో నిర్వహించిన ఈ అధికారిక విందులో అడవి కోడి వంటకాలను సుఖు ముట్టనప్పటికీ రాష్ట్ర ఆరోగ్య మంత్రి, మరి కొందరు అతిథులు మాత్రం దాన్ని ఆరగించినట్లు తెలుస్తోంది. వన్యప్రాణి సంరక్షణలో ఉన్న అడవి కోడిని చట్టవిరుద్ధంగా ఎలా వేటాడుతారని జంతు హక్కుల ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు. హిమాచల్ప్రదేశ్తోపాటు సముద్ర మట్టానికి 3,000 అడుగుల పైన ఉండే ఎత్తైన ప్రదేశాలలో మాత్రమే పెరిగే అడవి కోడిని వేటాడటం శిక్షార్హమైన నేరం.