Delhi | ఢిల్లీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. శనివారం ఫలితాలను ఈసీ ప్రకటించనున్నది. ఎన్నికల ఫలితాలకు ముందు ఢిల్లీలో హైడ్రామా నెలకొన్నది. ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే, ఎన్నికల్లో తమదే అధికారమని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. తమ అభ్యర్థులను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. మంత్రి పదవులతో పాటు ఒక్కొక్కరికి రూ.15కోట్ల వరకు డబ్బులు ఎరగా వేస్తుందని అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఆరోపణలను బీజేపీ కొట్టిపడేసింది. కేజ్రీవాల్ ఆరోపణలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు ఫిర్యాదు చేసింది. బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు ఎల్జీ వీకే సక్సేనా దర్యాప్తునకు ఆదేశించారు. ఈ క్రమంలో అవినీతి నిరోధక శాఖను విచారణకు ఆదేశించినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణు మిట్టల్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి చేసిన విజ్ఞప్తి మేరకు ఎల్జీ విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఆప్ నాయకుల ఆరోపణలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని.. ఢిల్లీలో భయాందోళనలు, అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలో ఎల్జీ ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం (ఫిబ్రవరి 8న) వెలువడనున్న నేపథ్యంలో 16 మంది అభ్యర్థులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ గురువారం ఆరోపించారు. ఆప్ అభ్యర్థులు పార్టీ మారితే మంత్రి పదవులతో పాటు ఒక్కొక్కరికి రూ.15కోట్లు ఇస్తామని బీజేపీ నుంచి ఆఫర్లు వచ్చినట్లు ఆరోపించారు. ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్తో పాటు పలువురు నాయకులు సైతం ఆరోపణలు చేయడం విశేషం.