బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన కుల గణనగా వ్యవహరించే సామాజిక-ఆర్థిక, విద్యాపరమైన సర్వేకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. సర్వేలో పాల్గొనడం తప్పనిసరి కాదని స్పష్టం చేసిన హైకోర్టు ప్రజలు తమ వివరాలు అందచేయడం ఐచ్ఛికం మాత్రమే అని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ఓ బహిరంగ ప్రకటన జారీచేయాలని ఆదేశించింది.
వివరాలు చెప్పాలంటూ ప్రజలను సర్వేయర్లు ఒత్తిడి చేయరాదని కూడా కోర్టు ఆదేశించింది. సేకరించిన సమాచారాన్ని గోప్యంగా భద్రపరచాలని, వెనుకబడిన తరగతుల కమిషన్కు మాత్రం అది అందుబాటులో ఉండాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను పాటిస్తామని అంగీకరిస్తూ అఫిడవిట్ సమర్పించాలని కమిషన్ని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను వాయిదా వేసింది.