చండీగఢ్/జైపూర్/అహ్మదాబాద్ : ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం దాడులు జరిపిన నేపథ్యంలో దాయాది దేశంతో సరిహద్దును పంచుకుంటున్న రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ రాష్ర్టాలు పూర్తిగా అప్రమత్తమయ్యాయి. పాక్ నుంచి వచ్చే ఎలాంటి ప్రతిఘటననైనా ఎదుర్కొనేందుకు పూర్తి అలర్ట్ మోడ్‌లోకి వెళ్లాయి. అందులో భాగంగా సరిహద్దు జిల్లాల్లోని స్కూళ్లను మూసివేశారు. పోలీసులు, పరిపాలనాధికారుల సెలవులు రద్దు చేశారు. వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పాకిస్థాన్‌తో పంజాబ్ 532 కిలోమీటర్లు, రాజస్థాన్ 1,070 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుండగా, గుజరాత్ తీర ప్రాంతంతోపాటు కొంత భూభాగాన్ని పంచుకుంటోంది.
ఈ నేపథ్యంలో సరిహద్దు జిల్లాలను అధికారులు అప్రమత్తం చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో రాజస్థాన్ పోలీసులను మోహరించింది. నాలుగు సరిహద్దు జిల్లాలైన శ్రీ గంగానగర్, బికనేర్, జైసల్మేర్, బార్మర్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లను ముందు జాగ్రత్త చర్యగా మూసివేసింది. పంజాబ్ కూడా ఆరు సరిహద్దు జిల్లాల్లోని స్కూళ్లను మూసివేసింది. పోలీసులు రెండో రక్షణ శ్రేణిగా పూర్తి సిద్ధంగా ఉన్నారని, పాకిస్థాన్ దాడికి తెగబడితే దీటుగా ప్రతిస్పందించేందుకు సైన్యంతో కలిసి పనిచేస్తారని పంజాబ్ మంత్రి అమన్ అరోరా తెలిపారు. ఇక, గుజరాత్ తీరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సెలవుల్లో ఉన్న పోలీసులు అందరూ తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని తీర ప్రాంత గ్రామాల ప్రజలను పోలీసులు కోరారు.