Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్‌ను మరోసారి భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తాయి. ఈ వర్షాలకు ఆకస్మిక వరదలు (Flash Floods) సంభవించాయి. పలు చోట్ల కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. శుక్రవారం సాయంత్రం నుంచి రాష్ట్రంలోని నహాన్‌లో అత్యధికంగా 168.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత సంధోల్లో 106.4మి,మీ, నగ్రోటా సూరియన్‌లో 93.2 మి.మీ, ధౌలకువాన్‌లో 67 మి.మీ, జుబ్బర్‌హట్టిలో 53.2 మి.మీ, కందఘహట్టిలో 45.6 మి.మీ వర్షపాతం నమోదైంది.
భారీ వర్షానికి పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. విద్యుత్, నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇక ఈ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా సుమారు 128 రోడ్లను అధికారులు మూసివేశారు (Roads Shut). రాష్ట్రంలో రానున్న రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శనివారం (ఈరోజు) పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఆగస్టు 16 వరకూ భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మండి, సిర్మౌర్, సిమ్లా, కులు జిల్లాల్లోని పలు ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వరదలకు పంట పొలాలు, పలు నిర్మాణాలు దెబ్బతినే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణ కేంద్ర హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, నదులు, వాగులు, కొండ ప్రదేశాలకు వెళ్లొద్దని సూచించింది. కాగా, జూన్ 27 నుంచి ఆగస్టు 9 మధ్య కురిసిన వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 100 మందికిపైగా మరణించారు. అదేవిధంగా రూ.842 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.
Also Read..
Jaishankar | మాల్దీవుల పర్యటనలో జైశంకర్.. అధ్యక్షుడు ముయిజ్జుతో భేటీ
Cisco Layoffs | AI ఎఫెక్ట్.. సిస్కోలో వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు.. ఆరు నెలల్లో రెండో సారి..!