శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో గురువారం వేకువ జాము నుంచి వర్షం కురుస్తున్నది. దీంతో రహదారులపై వరద నీరు నిలువగా.. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రాంబన్‌లో కొండచరియలు విరిగిపడడంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అఖ్నూర్లో చీనాబ్ నది ప్రమాదకర స్థాయిని మంచి ప్రవహిస్తున్నది.
ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా అధికారులు అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తులు బేస్ క్యాంపుల్లోనే ఉండాలని అధికారులు సూచించారు. అలాగే వర్షాల కారణంగా రియాసి జిల్లాలో త్రికూట పర్వతంపై కొలువైన మాతా వైష్ణోదేవి ఆలయాన్ని అధికారులు ముందు జాగ్రత్తగా మూసివేశారు.
అలాగే జిల్లా యంత్రాంగం అలెర్ట్‌ను ప్రకటించింది. కొండచరియలు విరిగిపడడంతో రియాసిలోని వివిధ మార్గాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. కొండ ప్రాంతాల్లో రాత్రి నుంచి వర్షం కురుస్తుండడంతో చీనాబ్ నది నీటిమట్టం ప్రమాదకరస్థాయికి మించి ప్రవహిస్తున్నది. చీనాబ్ నీటిమట్టం పెరుగుతున్న నేపథ్యంలో జమ్మూ డిప్యూటీ కమిషనర్ అవనీ లావాసా అలర్ట్ ప్రకటించారు. చీనాబ్ నది సమీపంలో నివసించే ప్రజలను అప్రమత్తం చేశారు.
రాజోరి జిల్లాలో దర్హాలి నదిలో నీటిమట్టం పెరుగుతున్నది. నదికి సమీపంలో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు. పూంచ్‌లోని ఝుల ప్రాంతంలో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నలుగురు వ్యక్తులు వరదల్లో చిక్కుకున్నారు. భారత సైన్యం, ఎస్డీఆర్ఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి కాపాడింది.