చెన్నై: తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో రాజధాని చెన్నై (Chennai) జలమయమయింది. చెన్నపట్నంలో గత 17 గంటలకుపైగా విడవకుండా వాన పడుతున్నది. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. చెన్నైతోపాటు శివారు ప్రాంతాల్లోనూ రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. అత్యధికంగా చెన్నై చోళవరంలో 22 సెంటీమీటర్ల వర్షపాతం (rainfall) నమోదయింది. గుమ్మడిపూండిలో 18 సెంటీమీటర్లు, ఎన్నూర్లో 17 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది.
భారీ వర్షాలకు చెన్నైలోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. ఎడతెరపిలేకుండా వానలు కురుస్తుండంతో రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి. ఏ క్షణమైన గేట్లను ఎత్తివేసే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
కాగా, చెన్నై తిరువళ్లూర్, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల్లో గురువారం సాయంత్రం వరకు అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాయంత్రం మహాబలిపురం వద్ద వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఈ సమయంలో గంటకు 40 వేగంతో గాలులు వీస్తాయని అధికారులు సూచించారు. దీంతో మహాబలిపురంలోని పర్యాటక ప్రాంతాలను ప్రభుత్వం మూసివేసింది. పర్యాటకులను అనుమతించేదిలేదని స్పష్టం చేసింది. భారీవర్షాల నేపథ్యంలో చెన్నై, నాగపట్నం, పుదుచ్చేరి కరైకాల్తోపాటు ఏడు ఓడరేవుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు.
Tamil Nadu | Incessant rain causes water-logging at several parts of Chennai pic.twitter.com/Wu3wruFKbG
— ANI (@ANI) November 11, 2021