Kerala : కేరళలో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. అనేక జిల్లాల్లో ఇండ్లు ధ్వంసం కాగా, రోడ్లు నీట మునిగాయి. భారీ వర్షాల కారణంగా ఒకరు మరణించారు. ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్గాడ్ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అలాగే, పతనాంథిట్ట, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిశూర్, పాలక్కాడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
రెడ్ అలర్ట్ ప్రకారం రాబోయే 24 గంటల్లో ఆయా జిల్లాల్లో 20 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉంది. ఆరెంజ్ అలర్ట్ ప్రకారం 11 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల రోడ్లు నీట మునిగాయి. చాలా చోట్ల ఇండ్లు, ఇతర ఆస్తులు ధ్వంసమయ్యాయి. దీంతో చాలా జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. ఒక తాత్కాలిక షెడ్‌పై చెట్టు పడటంతో అందులో నిద్రిస్తున్న 29 ఏళ్ల యువకుడు మరణించాడు. ఈ ఘటన త్రిశూర్ జిల్లాలోని మనలూర్ వద్ద జరిగింది. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరుసగా వర్షాల నేపథ్యంలో కేరళలోని పర్యాటక ప్రాంతాల్లో అధికారులు పలు ఆంక్షలు విధించారు. పర్వత ప్రాంతాల్లోకి ట్రెకింగ్ నిషేధించారు.
పర్యాటకులు కొండప్రాంతాల్ని వీడాలని, రాత్రి ప్రయాణాల్ని మానుకోవాలని సూచించారు. వయనాడ్, కోజికోడ్, కాసర్గాడ్ ప్రాంతాల్లో పలు ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయని, దీని కారణంగా గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, తమిలనాడులో వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ తెలిపింది. ఉత్తర కేరళ ప్రాంతంలో సైక్లోన్ ప్రభావం కూడా ఉంటుందని తెలిపింది. ఈ నెల వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, వేగంగా గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది.