శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిని ఆపేందుకు గుర్రం స్వారీ వ్యక్తి సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా ప్రయత్నించాడని సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) తెలిపారు. అయితే ఉగ్రవాదుల కాల్పుల్లో అతడు కూడా మరణించాడని చెప్పారు. బుధవారం నిర్వహించిన సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా అంత్యక్రియల్లో ఒమర్ అబ్దుల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. ‘ఏం చెప్పను? మా అతిథులు సెలవులకు వచ్చారు. దురదృష్టవశాత్తు శవపేటికల్లో వారిని పంపాం. ఈ యువకుడు (షా) జీవనోపాధి కోసం చాలా కష్టపడ్డాడు. పని కోసం ఇంటి నుంచి వెళ్లాడు. దురదృష్టవశాత్తు అతడి మృతదేహాన్ని శవపేటికలో తిరిగి ఇచ్చాం’ అని అన్నారు.
కాగా, సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా ఇతర పర్యాటకుల మాదిరిగా చనిపోలేదని తాను తెలుసుకున్నట్లు సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ‘అతడు తన ధైర్యాన్ని నిరూపించాడు. బహుశా దాడిని ఆపడానికి ప్రయత్నించాడు. బాధిత కుటుంబానికి మేం చేయగలిగినంత చేస్తాం. వారికి భరోసా ఇవ్వడానికి నేను వచ్చా’ అని అన్నారు.
మరోవైపు ‘మినీ స్విట్జర్లాండ్’గా ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం బైసరన్ వ్యాలీలో సేద తీరుతున్న పర్యాటకుల్లో మగవారిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. వారి పేర్లు అడిగి మరి ఈ దారుణానికి పాల్పడ్డారు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ మారణకాండలో 26 మంది మరణించగా సుమారు 20 మంది గాయపడ్డారు.