Jagdeep Dhankhar | పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ ఉప రాష్ట్రపతి (Vice-President) జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం రాత్రి రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తాజాగా ఆమోదించారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి రాజీనామాపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తొలిసారి స్పందించారు. ఉపరాష్ట్రపతి సహా వివిధ హోదాల్లో దేశానికి సేవ చేసేందుకు ధన్‌ఖడ్‌కు అనేక అవకాశాలు లభించాయన్నారు. ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
Shri Jagdeep Dhankhar Ji has got many opportunities to serve our country in various capacities, including as the Vice President of India. Wishing him good health.
श्री जगदीप धनखड़ जी को भारत के उपराष्ट्रपति सहित कई भूमिकाओं में देश की सेवा करने का अवसर मिला है। मैं उनके उत्तम…
— Narendra Modi (@narendramodi) July 22, 2025
ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం, వైద్యుల సలహాను పాటించడం కోసమే తాను ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నానని ధన్‌ఖడ్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 67(ఏ) అధికరణ కింద ఇది తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి కార్యాలయం ఈ లేఖను విడుదల చేసింది. తన బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తి సహకారాన్ని అందచేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మరో రెండేండ్లు పదవీకాలం ఉండగానే ధన్‌ఖడ్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. 2022లో ఎన్డీయే తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్ కావడంతో ఆయన బెంగాల్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. విపక్ష అభ్యర్థి మార్గరేట్ అల్వాపై విజయం సాధించి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 710 ఓట్లకుగాను 528 ఓట్లు గెలుచుకుని 1997 తర్వాత అత్యధిక ఓట్లతో ఉపరాష్ట్రపతిగా విజయం సాధించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన మూడో వ్యక్తి ధన్‌ఖడ్. అంతకుముందు 1969లో రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు వీవీ గిరి, 1987లో రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో ఆర్ వెంకటరామన్ ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. కానీ అలాంటిదేమీ లేకుండానే ధన్‌ఖఢ్ రాజీనామా చేయడం ఢిల్లీ రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది.
Also Read..
Jairam Ramesh | ధన్‌ఖడ్ రాజీనామా వెనుక లోతైన కారణం ఉండొచ్చు : జైరాం రమేష్
Next Vice President | ధన్‌ఖడ్ రాజీనామా.. తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరంటే?