Jairam Ramesh | దేశ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ ఉప రాష్ట్రపతి (Vice-President) జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఉదయం నుంచి ఎగువసభను సజావుగా నడిపించిన ఆయన రాత్రికి తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ముర్ముకు పంపారు. దీంతో ఆయన రాజీనామాపై ప్రస్తుతం తీవ్రంగా చర్చ నడుస్తోంది.
అనారోగ్య కారణాలతో పదవి నుంచి దిగిపోతున్నట్లు ధన్‌ఖడ్ చెప్పినప్పటికీ.. ఆయన రాజీనామాపై ప్రతిపక్ష పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏదో లోతైన కారణం ఉండొచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ (Jairam Ramesh) అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఎక్స్‌లో పోస్టు పెట్టారు. సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు బిజినెస్ అడ్వైజరీ కమిటీకి ధన్‌ఖడ్ అధ్యక్షత వహించినట్లు చెప్పారు. జేపీ నడ్డా, కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు సహా పలువురు హాజరైనట్లు తెలిపారు. చర్చ అనంతరం మళ్లీ సాయంత్రం 4:30 గంటలకు సమావేశం కావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
అయితే, మరోసారి భేటీకి నడ్డా, రిజుజు రాలేదని.. దీంతో సమావేశాన్ని మంగళవారం మధ్యాహ్నానికి వాయిదా వేసినట్లు చెప్పారు. ఇంతలోనే ఆయన అనూహ్యంగా రాజీనామా చేశారన్నారు. నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి 4:30 గంటల మధ్య ఏదో పెద్ద విషయమే జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. నడ్డా, రిజుజు ఉద్దేశపూర్వకంగానే ఆ సమావేశానికి హాజరు కాలేదని అన్నారు. ఈ క్రమంలోనే ధన్‌ఖడ్ అనూహ్యంగా రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపినట్లు చెప్పారు. ఆరోగ్య కారణాలతోనే పదవి నుంచి దిగిపోతున్నట్లు చెప్పారని.. దాన్ని మనం గౌరవించాలని జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ఆయన రాజీనామా వెనుక ఏదో లోతైన కారణమే ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
Also Read..
Next Vice President | ధన్‌ఖడ్ రాజీనామా.. తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరంటే?
ధన్‌ఖడ్ గుడ్‌బై.. ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా