భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (Madhya Pradesh Polls) కాషాయ దళం రాముడిని నమ్ముకుంటే పాలక బీజేపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ హనుమాన్ను తెరపైకి తీసుకువచ్చింది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌పై కాంగ్రెస్ పార్టీ టీవీ సీరియల్ రామాయణ్ 2లో హనుమాన్ పాత్రధారి విక్రమ్ మస్తల్‌ను బరిలో నిలిపింది. ఈ ఏడాది జులైలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మస్తల్‌ను ఆ పార్టీ నాయకత్వం ఏకంగా శివరాజ్ చౌహాన్‌పై పోటీకి నిలిపింది.
చౌహాన్ కంచుకోట బుధ్నిలో మస్తల్ తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. రాముడి పేరుతో కాషాయ పార్టీ సాగించే రాజకీయాలను హనుమాన్ శక్తితో ఎదుర్కొనే దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. జూన్ 12న జబల్పూర్లో హనుమాన్ భారీ కటౌట్లతో జై భజరంగ్ బలి నినాదాలు హోరెత్తిస్తుండగా ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది.
రానున్న ఎన్నికల్లో 150 స్ధానాలను చేజిక్కించుకునే ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలోని మొత్తం 230 నియోజకవర్గాల్లో సుందర కాండ పారాయణం చేపట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. హనుమాన్ను ఓన్ చేసుకునే దిశగా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కర్నాటక తరహాలో బజరంగ్‌బలి గద మధ్యప్రదేశ్‌లోనూ తమకు మెరుగైన ఫలితాలు అందిస్తుందని కాంగ్రెస్ నేత తరుణ్ భానోత్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Read More :