Hamas | న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్థాన్ టెర్రరిస్టులకే కాక మరికొందరి హస్తం కూడా ఉంచవచ్చునన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడి తరహాలోనే ఇప్పుడు పహల్గాంలో కూడా దాడి జరిగినట్టు పోలికలు కన్పించడంతో పాటు, గత ఏడాది కాలంలో హమాస్‌కు చెందిన పలువురు సీనియర్ నేతలు పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)ను సందర్శించినట్టు వెలుగులోకి రావడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన నివేదిక ప్రకారం జైషే మహమ్మద్ హెడ్‌క్వార్టర్స్ ఉన్న బహల్వపూర్ను హమాస్ బృందం ఇటీవల సందర్శించింది. కశ్మీర్ సంఘీభావ దినం సందర్భంగా పీవోకేలోని రావల్కోట్లో జరిగిన ర్యాలీలో హమాస్ నేతలు ప్రసంగించారు. ఎల్ఈటీ, జైషే మహ్మద్ నేతలు కూడా దీనికి హాజరయ్యారు. ఇవన్నీ చూస్తుంటే పహల్గాం దాడి విషయంలో వీరి హస్తం, సహకారం కూడా ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.