Gyanvapi Mosque | ఉత్తరప్రదేశ్ వారణాసిలోని (Varanasi) ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలో ఉన్న వివాదాస్పద జ్ఞానవాపి (Gyanvapi) మసీదు (Mosque) ప్రాంగణంలో సైంటిఫిక్ సర్వే ఏడో రోజు కొనసాగుతోంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (Archaeological Survey of India) అధికారులు బుధవారం ఉదయం సర్వే మొదలు పెట్టారు. 17వ శతాబ్ధానికి చెందిన ఈ మసీదులో.. ప్రాచీన కాలం నాటి హిందూ ఆలయం ఉందా లేదా అన్న కోణంలో పురావాస్తుశాఖ సర్వే చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ సర్వేలో మసీదు కమిటీ సభ్యులు కూడా పాల్గొంటున్నారు.
మరోవైపు ఈ సర్వేపై మీడియా కవరేజీని నిషేధించాలని (ban on media coverage) కోరుతూ ముస్లిం పక్షం జిల్లా కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు ఏఎస్ఐ సర్వే జరుగుతోందని.. అయితే దీనిపై ఏ అధికారి కూడా ప్రకటన ఇవ్వలేదన్నారు. కానీ సోషల్ మీడియా, టెలివిజన్, వార్తాపత్రికల్లో సర్వే గురించి నిరంతరం ఏదో ఒక వార్త వస్తోందన్నారు. ఆ వార్తలు ప్రజలను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సర్వేపై మీడియా కవరేజీని నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.
ఏమిటీ వివాదం?
వారణాసిలోని ప్రఖ్యాత విశ్వనాథ ఆలయం పక్కనే జ్ఞానవాపి మసీదు ఉంది. అయితే, ఈ మసీదు స్థానంలో ఒకప్పుడు శివాలయం ఉండేదని, 17వ శతాబ్దంలో మొఘల్ పాలకుడు ఔరంగజేబు ఆదేశాలతో ఆలయాన్ని పాక్షికంగా పడగొట్టి, దాని గోడలపైనే మసీదును నిర్మించారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. మసీదులో సర్వే నిర్వహించి సవివరమైన నివేదిక ఇవ్వాలని వారణాసి జిల్లా కోర్టు జూలై 21న ఏఎస్ఐ (ASI)ని ఆదేశించింది. దీనిపై అలహాబాద్ హైకోర్టులో మసీద్ కమిటీ పిటిషన్ వేయగా, తీర్పును ఆగస్టు 3న వెలువరించింది.
జ్ఞానవాపి (Gyanvapi) మసీదులో శాస్త్రీయ సర్వే కొనసాగించేందుకు భారత పురావస్తు శాఖ (ASI)కు
అనుమతి ఇచ్చింది. ఈ మేరకు వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు
కొట్టివేసింది. అయితే, మసీదులో సర్వే చేసేటప్పుడు నిర్మాణాలకు ఎలాంటి నష్టం జరగకూడదని స్పష్టం
చేసింది. కోర్టు ఆదేశాలతో గత వారం భారత పురావస్తు శాఖ సర్వేను తిరిగి ప్రారంభించింది.
Also Read..
Tomato Price | సామాన్యులకు గుడ్న్యూస్.. దిగొస్తున్న టమాట ధరలు.. 63కే కిలో!
Shimla Truck: షిమ్లాలో ట్రక్కు బీభత్సం.. అదుపు తప్పి కార్లను ఢీకొట్టింది.. వీడియో
CNG Cars | దుమ్మురేపుతున్న సీఎన్జీ కార్లు.. ఈ మూడు కార్లకు అయితే ఫుల్ డిమాండ్!