న్యూఢిల్లీ : విస్పష్ట మెజారిటీతో గుజరాత్లో పాలక బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చినా కాషాయ పార్టీ ప్రలోభాల పర్వాన్ని ప్రోత్సహించడంలో వెనుకాడటం లేదు. ఎంసీడీ ఎన్నికల్లో తమకు షాక్ ఇచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్‌ను ముప్పతిప్పలు పెట్టేందుకు కమలనాధులు గట్టి స్కెచ్ వేశారు. ఆప్ ఎమ్మెల్యేలు ఐదుగురిని పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది.
ఆప్ తరపున ఎన్నికైన ఐదుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు బీజేపీకి చెందిన వారే. తమకు టికెట్ నిరాకరించడంతో బీజేపీని వీడిన వీరు ఆప్‌లో చేరి ఆ పార్టీ తరపున అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి గెలిచారు. ఇప్పుడు వీరందరినీ బీజేపీలోకి వచ్చేలా కాషాయ పార్టీ సంప్రదింపులు జరుపుతోంది. ఇక ఆప్ తరపున ఎన్నికైన భూపట్ భయాని తాను ఆప్ నుంచి వైదొలగి బీజేపీలో చేరనున్నట్టు ధ్రువీకరించారు. జునాగఢ్ జిల్లాలోని విస్వదర్ నియోజకవర్గంలో భూపత్ భయాని బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్ధులపై గెలుపొందారు. ఇక చితర్ వసవ దెదిపద నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్ధిగా గెలుపొందగా, హేమంత్ ఖావ జంజోధ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.
ఆప్ నేత ఉమేష్ మకవన బొటద్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. సుధీర్ వఘాని గరియధర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఇక గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం ఆప్ జాతీయ పార్టీ హోదాను సాధించిందని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించగా తాజాగా గుజరాత్లో ఆప్ ఎమ్మెల్యేలు కాషాయ తీర్ధం పుచ్చుకోనుండటం ఆ పార్టీకి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 156 స్ధానాల్లో గెలుపొంది పాలనా పగ్గాలు చేపట్టనుండగా, కాంగ్రెస్ కేవలం 17 స్ధానాలకు పరిమితమైంది. ఆప్ ఐదు స్ధానాలకు కైవసం చేసుకుంది.