న్యూఢిల్లీ, డిసెంబర్ 20: భూ సేకరణలో న్యాయమైన పరిహారం, పారదర్శకత హక్కు చట్టం, 2013(ఎల్ఏఆర్ఆర్)ని షెడ్యూల్డ్డ్ ప్రాంతాల్లో కఠినంగా అమలు చేయాలని పార్లమెంటరీ కమిటీ పిలుపునిచ్చింది. ఇటీవల కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలాకా నేతృత్వంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌కు చెందిన ఈ కమిటీ ఇటీవల తన నివేదికను పార్లమెంట్ ముందు ఉంచింది. చట్ట నిబంధనలు ఉన్నప్పటికీ ఆచరణలో వీటి ఉల్లంఘనలు జరుగుతున్నాయని, ప్రత్యేకంగా మార్కెట్ లావాదేవీలపై ఆంక్షలు ఉన్న షెడ్యూల్డ్డ్ ప్రాంతాల్లో భూమి విలువను తక్కువగా చూపడం వంటివి ఇందుకు ఉదాహరణని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది.
నామమాత్రపు గ్రామసభలు నిర్వహిస్తూ భూసేకరణకు అంగీకరిస్తున్నట్లు సర్టిఫికెట్లను యాంత్రికంగా జారీ చేస్తున్నారని కమిటీ తెలిపింది. చట్టం నిబంధనలకు విరుద్ధంగా అటవీ భూముల సేకరణ జరుగుతున్న ఉదంతాలు తమ దృష్టికి ఎన్నో వచ్చాయని కమిటీ నివేదిక పేర్కొంది. మార్కెట్ విలువకు తగ్గట్టుగా భూసేకరణ జరగడం లేదని కమిటీ స్పష్టం చేసింది. జాతీయ పర్యవేక్షణ కమిటీ(ఎన్ఎంసీ) పనితీరుపై కూడా పార్లమెంటరీ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ పోలవరం, కెన్-బెట్వా లింక్ వంటి ప్రాజెక్టులను ఎప్పటికప్పుడు సమీక్షించకపోవడం వల్ల ముంపు బాధితులలో అసంతృప్తి పేరుకుపోతోందని కమిటీ పేర్కొంది.