బీజేపీ పాలనలో దేశం అధోగతి పాలైంది. 50 సూచీల్లో భారత్ అట్టడుగున నిలిచింది. తమ పాలనలో దేశం దేదీప్యమానంగా వెలుగుతున్నట్టు బీజేపీ చేసుకుంటున్న ప్రచారం బూటకమని ఏఐ చాట్‌బాట్ గ్రోక్ కుండబద్దలు కొట్టి మరీ రుజువు చేసింది.
దేశ ప్రగతికి కీలకమైన ఆర్థిక, సామాజిక, విద్య, వైద్య, పారిశ్రామిక రంగాలతోపాటు భద్రత, లింగ సమానత్వం, పౌర స్వేచ్ఛ, నిరుద్యోగిత, ప్రజాస్వామ్యం, ద్రవ్యోల్బణం తదితర సూచీల్లో భారత్ అట్టడుగున నిలిచింది.
ఆనందమయ దేశాలలో 118వ ర్యాంకుకు పతనమైంది. ఆకలి సూచీలో సూడాన్, రువాండా, కాంగో వంటి అతి పేద దేశాలకంటే అట్టడుగు స్థానంలో భారత్ నిలిచింది. పత్రికా స్వేచ్ఛలో భారత్ ర్యాంకు 140 నుంచి 159కి పడిపోయింది. ప్రజాస్వామ్య సూచీలో 2014లో భారత్ 27వ స్థానంలో ఉండగా ఇప్పుడు 47వ ర్యాంకుకు దిగజారింది. హెల్త్ అండ్ సర్వైవల్ ఇండెక్స్‌లో 2014లో 114వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం 142వ ర్యాంకుకు పడిపోయింది. పింఛన్ సూచీలోనూ అట్టడుగున నిలిచింది.
India | హైదరాబాద్, ఏప్రిల్ 11 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): పదకొండేండ్ల బీజేపీ ప్రభుత్వం వైఫల్యాల పుట్ట బద్దలైంది. దేశ ప్రగతికి కీలకంగా పరిగణించే ప్రధాన సూచీలు, అంశాల్లో ప్రపంచ దేశాల ముందు భారత్ దిగజారిపోయినట్టు తేటతెల్లమైంది. అయితే, అసలు వాస్తవాలను కప్పిపుచ్చి.. తమ పాలనలో దేశం దేదీప్యమానంగా వెలుగుతున్నట్టు బీజేపీ నేతలు చేసుకొంటున్న ప్రచారాన్ని ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’ కుండబద్దలు కొట్టి మరీ తప్పని రుజువు చేసింది. ‘పైన పటారం.. లోన లొటారం’ అన్నట్టు బీజేపీ ప్రభుత్వ పాలనంతా డంబాచారంగానే నడుస్తున్నట్టు తేల్చి చెప్పింది. దేశప్రగతికి కీలకమైన ఆర్థిక, సామాజిక, విద్య, వైద్యం, పారిశ్రామిక తదితర రంగాల్లో.. ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, ఉత్పాదకత, పౌర స్వేచ్ఛ వంటి 50కి పైగా సూచీల్లో మోదీ హయాంలో ఇండియా అట్టడుగు స్థానంలో నిలిచినట్టు ‘గ్రోక్’ ర్యాంకులతో సహా వెల్లడించింది.
వివరణ: నేరాలు, దాడులు, మత కల్లోలాలు, ఘర్షణలను ఆధారంగా చేసుకొని సురక్షిత దేశం ఏమిటన్న దానిపై ర్యాంకులను ప్రకటిస్తారు. సురక్షిత దేశాల్లో భారత్ కంటే పాకిస్థాన్ ఒక స్థానం మెరుగ్గా ఉండటం గమనార్హం.
వివరణ: సమ్మిళిత అభివృద్ధికి దిక్సూచీగా పిలిచే లింగసమానత్వ సూచీలోనూ భారత్ అంతకంతకూ దిగజారుతున్నది. 2014లో 114వ ర్యాంకు నమోదు చేసిన దేశం.. ప్రస్తుతం 129వ స్థానానికి పరిమితమైంది.
వివరణ: దేశంలోని మీడియా సంస్థలపై బీజేపీ సర్కారు నియంత్రణ ఎక్కువైందన్న వాదనలు ఉన్నాయి. దీన్ని నిరూపిస్తూ.. 2014లో పత్రికా స్వేచ్ఛ సూచీలో 140వ స్థానంలో ఉన్న భారత్.. 159కు దిగజారింది.
వివరణ: సూడాన్, రువాండా, కాంగో వంటి అతి పేద దేశాలకంటే ఆకలి సూచీలో భారత్ అట్టడుగు స్థానంలో నిలిచింది. 11 ఏండ్ల బీజేపీపాలనలో ఆకలిసూచీలో భారత్ ర్యాంక్ 50 స్థానాలు పతనమయ్యాయి.
వివరణ: విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామని, అవినీతిని నిర్మూలిస్తామంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కారు ఆ దిశగా తీసుకొన్న చర్యలు శూన్యం. ఫలితంగా.. గడిచిన పదకొండేండ్లలో అవినీతి సూచీలో భారత్ స్థానం మరింతగా పడిపోయింది.
వివరణ: ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత కారణంగా గడిచిన 30 ఏండ్లలో ఎన్నడూచూడని రీతిన పౌరుల పొదుపు ఖాతాలు ఖాళీ అయినట్టు మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ నివేదికలో ఇటీవలే వెల్లడైంది.
వివరణ: బీజేపీప్రభుత్వ హయాంలో పౌర హక్కుల ఉల్లంఘనలు పెరిగిపోయాయని ఆమ్నెస్టీ వంటి అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశాయి. దీన్ని ధ్రువపరుస్తూ 2014లో పౌర స్వేచ్ఛ సూచీలో 27వ ర్యాంకు సాధించిన భారత్.. ప్రస్తుతం 47కి పడిపోయింది.
వివరణ: సామాజిక భద్రత, ఆరోగ్యం, ఆదాయం, స్వేచ్ఛ, అవినీతి వంటి సూచీలను ఆధారంగా చేసుకొని వరల్డ్ హ్యాపినెస్ ఇండెక్స్‌ను ఏటా ప్రకటిస్తారు. 2014లో 111వ స్థానంలోస్థానంలో ఉన్న భారత్.. ఇప్పుడు 118వ స్థానానికి పరిమితమైంది.
వివరణ: వీసా అవసరం లేకుండా ఏ దేశానికైనా వెళ్లగలిగే అవకాశం కలిగిఉన్న పాస్‌పోర్ట్‌ను అత్యంత శక్తిమంతమైనదిగా భావిస్తారు. అవినీతి, నేరాలు, సంక్షోభాలు తక్కువగా ఉన్న దేశాలు ఈ సూచీలో మెరుగ్గా ఉంటాయి. గ్రోక్ వివరాల ప్రకారం.. హెన్లె శక్తిమంతమైన పాస్‌పోర్ట్ సూచీలో జపాన్, సింగపూర్ టాప్ ప్లేస్‌లో ఉండగా భారత్ 85వ స్థానంలో ఉన్నది.
వివరణ: ప్రకృతి సమతౌల్యాన్ని దెబ్బతీసే చర్యలను కట్టడి చేసే దేశాల జాబితాలోనూ భారత్ పేలవమైన ప్రదర్శన చూయించింది. బీజేపీ హయాంలో పర్యావరణ విధ్వంసం పెరిగిపోయింది. 11 ఏండ్లలోనే ఈ సూచీలో భారత్ 21 స్థానాలు దిగజారింది. 176వ ర్యాంకుకు పడిపోయింది.
వివరణ: పనిచేసే సామర్థ్యంలేని వయోధికులకు, రిటైరైన ఉద్యోగులకు ఆర్థిక సాయాన్ని అందించే పింఛన్ సూచీలో భారత్ 44వ స్థానంలో నిలిచింది. 48 దేశాలకు ఇచ్చిన ర్యాంకుల్లో భారత్ 44వ స్థానానికి పరిమితమవ్వడం ఆందోళనకరం.
వివరణ: దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న 157 దేశాల్లో ఇండియా 103వ ర్యాంక్ సాధించింది. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ సహా మొత్తం 102 దేశాలు ఈ సూచీలో భారత్ కంటే ఎంతో మెరుగ్గా ఉన్నాయి.
వివరణ: ఏదైనా దేశం ఆర్థికంగా బలోపేతంగా ఉండాలంటే ఎగుమతులు ఎక్కువగా ఉండాలి. చైనా ఒక ఏడాదిలో చేసే ఎగుమతుల విలువ.. మన దేశం పదేండ్ల ఎగుమతులకు సమానం
వివరణ: 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, గత ఏడాది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) 17 % మేర పడిపోయాయి. పదేండ్లలో ఇదే కనిష్ఠం.
వివరణ: మానవ వికాసం, నైపుణ్యాలను పెంపొందించే దిశగా ప్రభుత్వాలు తీసుకొంటున్న చర్యలను బట్టి ఇచ్చే మానవాభివృద్ధి సూచీలో భారత్ 134వ ర్యాంకుకు పరిమితమైంది. భారత్‌తో సమానమైన జనాభా ఉన్న చైనా ఈ విషయంలో ఎంతో మెరుగ్గా ఉంది.
వివరణ: పనిచేయగల సామర్థ్యం, ఉత్సాహం ఉన్నప్పటికీ, తగినన్ని ఉద్యోగాలు లేకపోవడమే నిరుద్యోగిత. దేశంలో పనిచేయగల సామర్థ్యం ఉన్న దాదాపు 22 కోట్ల మందికి ఇప్పటికీ తగిన ఉద్యోగాలు లభించలేదు.
వివరణ: భారత్‌లో ప్రజాస్వామ్యానికి విఘాతం ఏర్పడుతున్నట్టు ఇప్పటికే పలు స్వచ్ఛంద నివేదికలు హెచ్చరించాయి. ప్రజాస్వామ్య సూచీలో ప్రస్తుతం భారత్ ర్యాంకు 47. పదకొండేండ్ల కిందట ఇది 27గా ఉండేది.
వివరణ: ఆరోగ్యం, మనుగడకు అవసరమైన సదుపాయాల విషయంలో భారత్ ఎంతో వెనుకబడి ఉన్నది. హెల్త్ అండ్ సర్వైవల్ ఇండెక్స్‌లో 2014లో 114వ ర్యాంకులో ఉన్న ఇండియా.. ప్రస్తుతం 28 స్థానాలు తగ్గి 142వ ర్యాంకులో స్థిరపడింది.
వివరణ: దేశంలో ఎన్నడూ చూడనంతగా ద్రవ్యోల్బణం కట్టలుతెంచుకొంటున్నది. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అందుకే ఈ సూచీలో భారత్ అట్టడుగున ఉన్నది.
వివరణ: ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన భారత్‌లో.. ఉత్పాదకత రేటు అత్యంత తక్కువగా ఉన్నది. నిరుద్యోగం, పారిశ్రామిక, వ్యాపార రంగాలకు ప్రభుత్వం తోడ్పాటునివ్వకపోవడమే దీనికి కారణం.
వివరణ: అమెరికన్ డాలర్‌ను అంతర్జాతీయంగా ప్రామాణిక కరెన్సీగా పరిగణిస్తారు. ఒక కువైట్ దినార్‌కు 3.24 అమెరికన్ డాలర్లు వస్తే, ఒక అమెరికన్ డాలర్‌ను కొనుగోలు చేయాలంటే, 86 రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంటుంది. చరిత్రలో అత్యంత కనిష్ఠ స్థాయికి రూపీ విలువ పడిపోవడం నిత్యకృత్యంగా మారింది.
వివరణ: గడిచిన 11 ఏండ్లలో నిత్యావసర వస్తువుల ధరలు దేశంలో దాదాపుగా 350 శాతం వరకు పెరిగాయి.
వివరణ: సమాజంలోని అన్నివర్గాల అభ్యున్నతి, సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకొనే పథకాలు,
నిర్ణయాలను బట్టి సామాజిక సంక్షేమం ఆధారపడి ఉంటుంది. భారత్‌వంటి జనాభా ఎక్కువ గల దేశం.. సామాజిక సంక్షేమ సూచీలో మెరుగ్గాలేకపోవడం అందోళన కలిగిస్తున్నది.
వివరణ: ప్రపంచవ్యాప్తంగా ఏడాదిలో జరిగే మొత్తం ఇంటర్నెట్ షట్డౌన్లలో భారత్ వాటా 56 శాతం.
దేశ ఆర్థికాభివద్ధికి కీలకమైన విద్యుదుత్పత్తి, జీడీపీ వృద్ధిరేటు, జీడీపీ మొత్తం విలువ, క్రెడిట్ రేటింగ్, గోల్డ్ రిజర్వ్స్, కరెంట్ అకౌంట్, వడ్డీరేట్లు, జనాభా-బడ్జెట్ వ్యాల్యూ, రాబడి-వ్యయం, జీడీపీలో పారిశ్రామికరంగం వాటా, జీడీపీలో తయారీరంగం వాటా, జీడీపీలో నిర్మాణరంగం వాటా, జీడీపీలో మైనింగ్ వాటా, జీడీపీలో సేవలు, జీడీపీలో అడ్మిన్ సర్వీసెస్, దిగుమతుల సూచీ, హోమ్ ఓనర్షిప్ రేట్, బ్యాంకుల్లో క్యాష్ రిజర్వ్‌లు, బిజినెస్ కాన్ఫిడెన్స్ సూచీ, సమ్మిళిత వృద్ధి, వైద్య సేవలు తదితర కీలకాంశాల్లో భారత్ అట్టడుగు స్థానాల్లో (60 నుంచి 100 ర్యాంకుల మధ్య) ఉన్నట్టు ‘గ్రోక్’ చాట్‌బాట్ పేర్కొంది. వరల్డ్ కాంపిటీటివ్ ర్యాంకింగ్స్, జీవన ప్రమాణాల సూచీ, పారదర్శక పాలన, చట్టబద్ధ పాలన, పరివర్తన సూచీలో భారత్ మిగతా దేశాలతో పోలిస్తే ఎంతో వెనుకంజలో ఉన్నట్టు ‘గ్రోక్’ వివరించింది.