Delhi Pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Delhi Pollution) డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తోంది. శనివారం ఉదయం ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యం ప్రమాదకరస్థాయిలో నమోదైంది. 18 మానిటరింగ్ స్టేషన్లలో ఏక్యూఐ లెవెల్స్ 400కిపైగానే నమోదయ్యాయి. తీవ్ర వాయు కాలుష్యం నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. రాజధాని నగరంలో ఆంక్షలు అమల్లోకి తెచ్చారు.
తీవ్ర వాయు కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో జీఆర్ఏపీ స్టేజ్-3 ఆంక్షలు (GRAP Stage III Curbs Imposed ) అమలు చేస్తున్నట్లు అధికారులు శనివారం తెలిపారు. అనవసరమైన నిర్మాణాలు, కూల్చివేత పనులు, రాత్రి క్రషింగ్, మైనింగ్ కార్యకలాపాలపై నిషేధం విధించారు. అంతేకాదు డీజిల్‌తో నడిచే పాత వాహనాలకు ఢిల్లీలోకి ప్రవేశం లేదు. మరోవైపు విద్యాసంస్థలకు కూడా ప్రభుత్వం కీలక విజ్ఞప్తి చేసింది. హైబ్రిడ్ పద్ధతిని అవలంభించాలని సూచించింది. ఐదవత తరగతి వరకూ పిల్లలకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని సూచించింది. ఢిల్లీ-ఎన్సీఆర్లోని కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో మాత్రమే పనిచేయాలని సూచించింది.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (Central Pollution Control Board) ప్రకారం.. శనివారం ఉదయం ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలోని 18 మానిటరింగ్ స్టేషన్లలో ఏక్యూఐ లెవెల్స్ 400కిపైగానే నమోదయ్యాయి. ఇవాళ ఢిల్లీలో ఓవరాల్ ఏక్యూఐ 387గా నమోదైంది. వజీర్‌పూర్‌లో అత్యధికంగా ఏక్యూఐ లెవెల్స్ 443గా నమోదయ్యాయి. ఆ తర్వాత జహంగీర్‌పురిలో 439, వివేక్ విహార్‌లో 437, రోహిణి, ఆనంద్ విహార్ ప్రాంతాల్లో ఏక్యూఐ లెవెల్స్ 434 చొప్పున, అశోక్ విహార్‌లో 431, సోనియా విహార్, డీటీయూలో 427 చొప్పున, నరేలాలో 425, బవానా ప్రాంతంలో 424, నెహ్రూ నగర్లో 421, పట్పర్గంజ్లో 419, ఐటీవోలో 417, పంజాబీ బాగ్‌లో 416, ముండ్కా ప్రాంతంలో 415, బురారీ క్రాసింగ్ వద్ద 413, చాందినీ చౌక్ ఏరియాలో 412, ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్ ప్రాంతంలో 401గా ఏక్యూఐ లెవెల్స్ నమోదయ్యాయి. ఎన్సీఆర్ ప్రాంతంలోనూ వాయు కాలుష్యం ప్రమాదకరస్థాయిలోనే ఉంది. ఘజియాబాద్, నోయిడాలో ఏక్యూఐ స్థాయిలు 422గా నమోదయ్యాయి.
వాయు కాలుష్యానికి తోడు నగరంలోని అనేక ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో దృశ్యమానత పడిపోయింది. దీంతో ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు కీలక అడ్వైజరీ జారీ చేసింది. విజిబిలిటీ పడిపోయినప్పటికీ విమాన రాకపోకలు సాధారణ స్థాయిలోనే ఉన్నాయని తెలిపింది. ప్రయాణికులు తమ విమాన స్టేటస్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించింది. మరోవైపు ఉత్తర భారతం అంతటా సీజన్లో మొదటిసారిగా దట్టమైన పొగమంచు ఏర్పడింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోనూ పొగమంచు పరిస్థితులు ఏర్పడ్డాయి. యూపీ, పంజాబ్‌లో విజిబిలిటీ 50 మీటర్లకంటే తక్కువగా నమోదైంది. దీంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.
గాలి నాణ్యత సున్నా నుంచి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని, 101 నుంచి 200 వరకు ఉంటే మితమైన నాణ్యత, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైనదని, 401 నుంచి 500 ఉంటే ప్రమాదకరస్థాయిగా పరిగణిస్తారు.
Also Read..
Vehicles Collide | పొగమంచు.. నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై ఢీకొన్న వాహనాలు.. పలువురికి గాయాలు
Lionel Messi | మెస్సీ కోసం హనీమూన్ వాయిదా.. కొత్త పెళ్లికూతురి క్రేజీ ప్లకార్డ్