బెంగుళూరు: కర్నాటక సీఎం సిద్ధరామయ్య నియోజకవర్గంలోని వరుణ గ్రామానికి చెందిన దివ్య అనే పంచాయితీ కార్యదర్శి(Panchayat Secretary) ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. గ్రేడ్-1 పంచాయితీ సెక్రటరీ అయిన దివ్య.. సుమారు 15 మాత్రలు మింగి ఆఫీసులో సూసైడ్ అటెంప్ట్ చేసింది. పారాసిటమాల్‌తో పాటు పెయిన్ కిల్లర్, ఫీవర్ మాత్రలు ఆమె వేసుకున్నది. గత రెండేళ్ల నుంచి వరుణ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా దివ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నది. మరో గ్రామ పంచాయతీకి చెందిన గ్రేడ్ -1 కార్యదర్శి బదిలీ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అప్పటి నుంచి దివ్య టెన్షన్‌కు గురవుతున్నది. దివ్య స్థానంలో బదిలీ అయ్యేందుకు ఆ వ్యక్తి ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది.
నవంబర్ 20వ తేదీన వరుణ పంచాయతీ ఆఫీసులో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆరు నెలల క్రితం దివ్యపై దాఖలైన ఫిర్యాదును దర్యాప్తు చేసే ఉద్దేశంతో ఆ ఆఫీసర్ అక్కడకు వెళ్లారు. దివ్య సరిగా విధులు నిర్వర్తించడం లేదని ఆమెపై ఫిర్యాదు ఉన్నది. పంచాయితీ సభ్యుల సమక్షంలోనే దర్యాప్తు జరిగింది. అయితే వారంతా దివ్యను సమర్థించారు. ఆమె సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు చెప్పారు.
బహుశా బదిలీ చేస్తారేమో అన్న భయంతో దివ్య ఉత్కంఠకు గురైంది.ఆ టెన్షన్లోనే ఆమె 15 ట్యాబ్లెట్లు మిగింది. ఆఫీసులోనే ఆమె స్పృహ కోల్పోయింది. పంచాయితీ కార్యదర్శి ఆఫీసులోని తోటి ఉద్యోగులు దివ్యను నిద్రలేపే ప్రయత్నం చేశారు. ఫలితం రాకపోవడంతో ఆమెను మైసూరులోని కావేరి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దివ్య ఎటువంటి ఫిర్యాదు నమోదు చేయలేదు. సీఎం సిద్ధరామయ్య స్వంత నియోజకవర్గంలో వరుణ గ్రామం ఉండడంతో .. పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం అందరి దృష్టిలో పడింది.