న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ధరల పెరుగుదలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలకు దిగింది. ప్రభు త్వం వద్ద ఉన్న 4.7 లక్షల టన్నుల ఉల్లిగడ్డల నిల్వలను ప్రధాన నగరాల్లోని హోల్సేల్ మార్కెట్లలో విక్రయిస్తున్నది. దీంతో పాటు దేశవ్యాప్తంగా సబ్సిడీ ద్వారా రూ.35కు కిలో చొప్పున రిటైల్లో విక్రయించాలని భావిస్తున్నట్టు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖారే సోమవారం తెలిపారు.
ప్రస్తుతం ఢిల్లీ సహా రాష్ట్ర రాజధానుల్లో సబ్సిడీ ధరకు ఉల్లి విక్రయాలు జరుపుతున్నట్టు చెప్పారు. కాగా, ఉల్లి ఎగుమతులపై సుంకాన్ని ఎత్తేయడంతో ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లిగడ్డల ధర దాదాపు రూ.60కు చేరుకుంది.