Subsidies | న్యూఢిల్లీ, జూలై 23: మోదీ 3.0 ప్రభుత్వం ఆహార, ఎరువులు, వంట ఇంధనంపై ఇచ్చే సబ్సిడీల్లో భారీగా కోత విధించింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో ఎరువులు, ఇంధనం, ఆహార పదార్థాలపై ఇచ్చే సబ్సిడీలో 7.8 శాతం కోత విధిస్తున్నట్టు ప్రతిపాదించారు. ఆహార, ఇంధనం, ఎరువులకు సబ్సిడీ కోసం గత ఏడాది రూ.4,13,466 కోట్లు కేటాయించగా, తాజా బడ్జెట్లో రూ.3,81,175 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. కేవలం ఆహార సబ్సిడీపైనే దాదాపు రూ.7 వేల కోట్ల కోత విధించారు. దీంతో దేశంలోని దాదాపు 80 కోట్ల మందిపై ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు. జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద ప్రభుత్వం అధిక ధరలకు ధాన్యాన్ని సేకరించి, తక్కువ ధరకు విక్రయిస్తుంది. ఈ తేడాను భర్తీ చేయడానికి ప్రభుత్వం సబ్సిడీని ఇస్తుంది. ఆహార పదార్థాలపై ఇచ్చే సబ్సిడీలో కోత విధించడం ద్వారా వాటి ధరలు పెరగడమే కాకుండా పేదల కోసం అమలు చేసే సంక్షేమ పథకాలు కూడా ప్రభావితమవుతాయని భావిస్తున్నారు.
ఎరువులకు ఇచ్చే సబ్సిడీపై కూడా కేంద్రం భారీ కోత విధించింది. గత ఏడాది సవరించిన అంచనాల ప్రకారం ఎరువులపై ఇచ్చిన సబ్సిడీ రూ.1,88,894 కోట్లు కాగా, ప్రస్తుత బడ్జెట్లో ఆర్థికమంత్రి కేవలం రూ.1,64,000 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. వాస్తవానికి సవరించిన అంచనాల కన్నా తాజా కేటాయింపులు అధికంగా ఉంటాయి. అందుకు విరుద్ధంగా కేంద్రం సబ్సిడీలపై కోత విధించడం గమనార్హం. ఎరువులపై కేంద్రం ఇచ్చే సబ్సిడీ అటు ఉత్పత్తిదారులకు, ఇటు రైతులకు ఉపయోగపడతుంది. యూరియాతోపాటు డీఏపీ, ఎంవోపీ వంటి ఎరువులకు సబ్సిడీ వర్తిస్తుంది.
పెట్రోలియం సబ్సిడీలు, ముఖ్యంగా ఎల్పీజీ గ్యాస్‌పై ఇచ్చే సబ్సిడీలో కూడా కోత విధించారు. గత ఏడాది సవరించిన అంచనాల ప్రకారం ఎల్పీజీపై ఇచ్చిన సబ్సిడీ రూ.12,240 కోట్లు కాగా, ప్రస్తుత బడ్జెట్లో ఆ మొత్తాన్ని రూ.11,925 కోట్లకు తగ్గించారు.
సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కేంద్ర బడ్జెట్లో చేపట్టిన చర్యలు అద్భుతంగా ఉన్నాయి. దేశ ఉజ్వల భవిష్యత్తుకు, మెరుగైన వృద్ధికి దోహదపడే ఈ బడ్జెట్.. భారత్‌ను ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలిపేందుకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను నిలిపేందుకు బలమైన పునాది వేస్తుంది. దీనిలో ప్రతిపాదించిన ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాలు కొత్తగా కోట్లాది ఉద్యోగాలను సృష్టిస్తాయి. మన సమాజంలోని ప్రతి వర్గాన్ని ఉద్ధరించి, సాధికారత కల్పిస్తుంది. దళితులు, అణగారిన వర్గాలకు శక్తినిచ్చే ఈ బడ్జెట్లో మహిళల ఆర్థిక స్వావలంబనతోపాటు చిరు వ్యాపారులు, ఎంఎస్ఎంఈల అభివృద్ధికి కొత్త బాటలు వేశాం. ఉద్యోగ, ఉపాధి కల్పన, స్వయం ఉపాధికి ప్రాధాన్యమిచ్చాం. కొత్త ఉద్యోగులకు తొలి జీతాన్ని మా ప్రభుత్వమే ఇస్తుంది.
– నరేంద్రమోదీ, ప్రధాన మంత్రి
ఇది కుర్చీని కాపాడుకునే బడ్జెట్. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మ్యానిఫెస్టోతోపాటు పూర్వపు బడ్జెట్లను కాపీ కొట్టి ప్రస్తుత బడ్జెట్లో పేస్ట్ చేశారు. ఈసారి కూడా సామాన్య ప్రజలకు ఎలాంటి ఉపశమనం కల్పించకుండా సంపన్నులకే ప్రయోజనాలు చేకూర్చారు.
– రాహుల్, లోక్‌సభ ప్రతిపక్ష నేత
దేశంలోనే అతిపెద్ద పన్ను చెల్లింపుదారుగా కేంద్రానికి మహారాష్ట్ర ఇస్తున్నది ఎంత? కేంద్రం నుంచి తీసుకుంటున్నది ఎంత? బడ్జెట్లో మహారాష్ట్ర గురించి కనీసం ఒక్కసారైనా ఎందుకు ప్రస్తావించలేదు? మహారాష్ట్రను కేంద్రం ఎందుకు ద్వేషిస్తున్నది?
– ఆదిత్య, శివసేన(యూబీటీ) నేత


