Fuel Prices | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): పెరిగిన నిత్యావసరాల ధరలతో కుదేలవుతున్న సామాన్యుడిని రోజురోజుకూ పెరగడమే తప్ప తరగని పెట్రోలు, డీజిల్ ధరలు మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కొన్ని రాష్ర్టాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున వాటి ధరలు ఇప్పుడైనా కేంద్రం తగ్గిస్తుందేమోనని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లలో బ్యారెల్ ముడిచమురు ధర 9 నెలల కనిష్ఠానికి చేరినప్పటికీ, దేశీయంగా ఇంధన ధరలను మాత్రం కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ఇంకా తగ్గించట్లేదు. అంతర్జాతీయ విపణిలో ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 70 డాలర్ల దిగువకు చేరింది. అయినప్పటికీ, దేశీయంగా లీటర్ పెట్రోల్ ధర రూ. 109, డీజిల్ ధర రూ. 97గానే ఉన్నది. కాగా, మోదీ ప్రధానిగా తొలిసారిగా బాధ్యతలు చేపట్టిన 2014లో లీటర్ పెట్రోల్ ధర రూ.71 ఉంటే ప్రస్తుతం ఇది రూ.109కు పెరిగింది. అప్పుడు రూ. 55గా ఉన్న లీటర్ డీజిల్ ధర ఇప్పుడు రూ.97కు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగినప్పుడు పెట్రో వాతపెట్టిన ఎన్డీయే సర్కారు.. ధరలు తగ్గినప్పుడు మాత్రం వాటి ధరలను తగ్గించట్లేదు. దీంతో సామాన్యులకు అందాల్సిన ప్రయోజనాలు అందకుండా పోతున్నాయి. వివరంగా చెప్పాలంటే.. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గితే, దేశీయంగా పెట్రో ధరలు తగ్గాలి. కానీ దానికి విరుద్ధంగా కేంద్రం ఇంధన ధరలను పెంచుకుంటూ పోతున్నది. దీనికోసం ఎక్సైజ్ డ్యూటీ పేరిట అదనపు సుంకాలను విధిస్తున్నది.
గత పదేండ్లలో కేంద్రం పెట్రోల్‌పై 109.91 శాతం ఎక్సైజ్ డ్యూటీని పెంచగా, డీజిల్‌పై ఏకంగా 343.82 శాతం పన్ను పెంచినట్టు పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ గణాంకాలు చెప్తున్నాయి. త్వరలో వివిధ రాష్ర్టాలకు అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పెట్రో ధరలు తగ్గవచ్చని నిపుణులు భావిస్తున్నారు.