దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇంకా కరోనా విపత్తు సమసిపోలేదని ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరికలు చేసింది. ఈ క్రమంలోనే చాలా దేశాలు బూస్టర్ డోసులు వేసుకోవాలని ప్రజలకు సూచనలు చేస్తున్నాయి. భారత ప్రభుత్వం కూడా బూస్టర్ డోసులు వేసుకోవాలని చెప్పింది. కానీ దీనిపై ప్రజలు ఆసక్తి చూపడం లేదు.
60 ఏళ్లు పైబడిన వారిలో కనీసం 16 కోట్ల మంది బూస్టర్ డోసు తీసుకుంటారని అంచనా వేస్తే.. వాటిలో కేవలం 26 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారని గణాంకాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 18-59 సంవత్సరాల మధ్య వారు కూడా బూస్టర్ డోస్ తీసుకోవాలని నిపుణులు వెల్లడించారు. దేశంలో ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న సుమారు 77 కోట్ల మంది బూస్టర్ డోస్ తీసుకోవాల్సి ఉంది.
కానీ వారిలో ఒక్క శాతం మంది మాత్రమే ప్రికాషనరీ డోస్ (బూస్టర్ డోస్) వేయిచుకున్నారు. ఈ పరిస్థితిని గమనించిన కేంద్ర ప్రభుత్వం.. 18-59 సంవత్సరాల వయసులో ఉన్న వారందరికీ ఉచితంగా బూస్టర్ డోస్ ఇవ్వాలని నిర్ణయించింది. దీనికోసం ఈ నెల 15వ తేదీ నుంచి 75 రోజుల పాటు ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్లలో ఉచితంగా బూస్టర్ డోస్ అందివ్వనున్నట్లు సమాచారం.
భారత దేశానికి స్వతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’’ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రజలకు 75 రోజులపాటు ఉచితంగా బూస్టర్ డోస్ అందిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.